కిసాన్ క్రెడిట్ కార్డు..! పంట సాగుకు రైతుకు ఆర్థిక భరోసా..

-

రైతుల‌కు స్వ‌ల్పకాలిక రుణ స‌దుపాయం అందించాల‌నే ఉద్దేశంతోనే కిసాన్ క్రెడిట్ కార్డుల‌ను ప్ర‌వేశ పెట్టారు. ఇత‌ర క్రెడిట్ కార్డుల క‌న్నా ఈ కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణం పొందితే అయ్యే వ‌డ్డీ రేటు చాలా త‌క్కువ‌గా ఉంటుంది.

పంటల సీజ‌న్ మొద‌లైందంటే చాలు రైతులు బిజీ అయిపోతుంటారు. పొలం దున్న‌డం, విత్త‌నాలు, ఎరువులు కొనుగోలు చేయ‌డం.. వాటి కొనుగోలుకు కావ‌ల్సిన పెట్టుబ‌డిని స‌మ‌కూర్చుకోవ‌డం.. త‌దిత‌ర పనుల్లో వారు త‌ల‌మున‌క‌లై ఉంటారు. అయితే డ‌బ్బు లేక‌పోతే.. ఎక్క‌డా అప్పు పుట్ట‌క‌పోతే రైతులు ప‌డే ఇబ్బంది అంతా ఇంతా కాదు. అలాంట‌ప్పుడు వారికి ఉప‌యోగ‌ప‌డేదే కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ). పంట‌ల‌ను సాగు చేసే స‌మ‌యంలో రైతులు డబ్బుల కోసం ఇబ్బందులు ప‌డ‌కుండా ఉండేందుకు గాను వారికి కావ‌ల్సిన ఆర్థిక స‌హాయాన్ని అందిచేందుకు 20 ఏళ్ల కింద‌టే ఈ ప‌థ‌కాన్ని అప్ప‌టి కేంద్ర ప్ర‌భుత్వం అందుబాటులోకి తెచ్చింది.

రైతుల‌కు స్వ‌ల్పకాలిక రుణ స‌దుపాయం అందించాల‌నే ఉద్దేశంతోనే కిసాన్ క్రెడిట్ కార్డుల‌ను ప్ర‌వేశ పెట్టారు. ఇత‌ర క్రెడిట్ కార్డుల క‌న్నా ఈ కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణం పొందితే అయ్యే వ‌డ్డీ రేటు చాలా త‌క్కువ‌గా ఉంటుంది. సాధార‌ణంగా రైతులు అప్పుగా తీసుకునే మొత్తానికి వ‌డ్డీ ఎక్కువ‌గా క‌ట్టాల్సి వ‌స్తుంది. కానీ కిసాన్ క్రెడిట్ కార్డుల‌కు అలా కాదు. చాలా త‌క్కువ వ‌డ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక కిసాన్ క్రెడిట్ కార్డులను ఆర్‌బీఐ, నాబార్డు క‌ల‌సి అందిస్తున్నాయి. ఇక కొన్ని ప్ర‌ధాన బ్యాంకుల్లో కేవ‌లం నాబార్డ్ మాత్ర‌మే మోడ‌ల్ కిసాన్ క్రెడిట్ కార్డుల‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో రైతులు బ్యాంకుల నుంచి చాలా త‌క్కువ వడ్డీకే పంట సాగుకు అవ‌స‌ర‌మైన రుణాన్ని పొంద‌వచ్చు.

కాగా కిసాన్ క్రెడిట్ కార్డుల స‌హాయంతో రైతులు త‌మ‌కు అవ‌స‌రం ఉన్న‌ప్పుడు న‌గ‌దు తీసుకోవ‌చ్చు. ఇక రైతుల‌కు ఉన్న భూమి, వ‌స్తున్న ఆదాయం త‌దిత‌ర వివ‌రాల‌ను తెలుసుకుని అందుకు అనుగుణంగా బ్యాంకులు వారికి కిసాన్ క్రెడిట్ కార్డుల‌ను అందిస్తుంటాయి. అయితే గ‌తంలో రైతులు చేసిన అప్పులు, చెల్లించిన మొత్తం త‌దిత‌ర వివ‌రాల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని మాత్ర‌మే కిసాన్ క్రెడిట్ కార్డు ఇస్తారు. కిసాన్ క్రెడిట్ కార్డుతోపాటు పాసు పుస్త‌కాల‌ను కూడా ఇస్తారు. వాటిల్లో రైతుకు ఉన్న వ్య‌వ‌సాయ భూములు, వాటి వివ‌రాలు, చిరునామా, వాలిడిటీ, క్రెడిట్ లిమిట్ వంటి వివ‌రాల‌ను పొందు ప‌రుస్తారు. ఈ క్ర‌మంలో క్రెడిట్ కార్డుల‌ను పొందిన రైతులు ఆ కార్డు నుంచి డ‌బ్బును విత్ డ్రా చేసుకోవ‌చ్చు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా సుమారుగా 6.95 కోట్ల మంది రైతులు ఈ క్రెడిట్ కార్డుల‌ను పొందిన‌ట్లు రికార్డులు చెబుతున్నాయి.

కిసాన్ క్రెడిట్ కార్డులను వ్య‌క్తిగ‌త లేదా ఉమ్మ‌డి భూమి ఉన్న రైతులు పొంద‌వ‌చ్చు. అయితే వారు భూమి సాగు చేస్తున్న‌ట్లు రికార్డులు ఉండాలి. అలాగే కౌలు రైతులు, స్వ‌యం స‌హాయక బృందాలు కూడా కిసాన్ క్రెడిట్ కార్డును పొంద‌వ‌చ్చు. అందుకు గాను వ్య‌క్తుల‌కు క‌నీస వ‌యస్సు 18 సంవ‌త్స‌రాలు ఉండాలి. అలాగే రుణం చెల్లింపు పూర్త‌య్యే నాటికి గ‌రిష్ట వ‌య‌స్సు 75 సంవ‌త్స‌రాల లోపు ఉండాలి. 60 ఏళ్లు పైబ‌డిన వారు కూడా కిసాన్ క్రెడిట్ కార్డుకు ఉమ్మడిగా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. కానీ వారి వార‌సులు లేదా కుటుంబ స‌భ్యుల‌తో మాత్రమే అందుకు అవ‌కాశం ఉంటుంది.

కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న రైతుకు వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా ఉంటుంది. ఒక‌వేళ రైతు మ‌ర‌ణించిన ప‌క్షంలో రూ.50వేలు, ప్ర‌మాదానికి గురైతే రూ.25వేలు ల‌భిస్తాయి. 70 ఏళ్ల క‌న్నా ఎక్కువ వ‌య‌స్సు ఉన్న వారు కార్డుకు ద‌ర‌ఖాస్తు చేసుకుంటే వారికి బీమా పాల‌సీ ఉండ‌దు. ఆర్‌బీఐ ఇచ్చిన సూచ‌న‌ల ప్ర‌కారం.. కిసాన్ క్రెడిట్ కార్డు కావ‌ల్సిన వారు ఆధార్‌, పాన్, ఓట‌ర్ ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డులు చూపించాలి. అలాగే అడ్ర‌స్ ప్రూఫ్ కింద ఆధార్‌, ఓట‌ర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ పెట్ట‌వ‌చ్చు. ఇక ద‌ర‌ఖాస్తు ఫాంలో రైతు పూర్తి చిరునామా ఇవ్వాలి. అలాగే పాస్‌పోర్టు సైజ్ ఫొటోను జ‌త చేయాల్సి ఉంటుంది.

కిసాన్ క్రెడిట్ కార్డుల కోసం ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అందుకు గాను ఆ కార్డుల‌ను అందిస్తున్న ఆయా బ్యాంకుల వెబ్ సైట్లు ఓపెన్ చేసి కార్డు కోసం ద‌రఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫాం నింపి స‌బ్‌మిట్ చేయ‌గానే ఒక అప్లికేష‌న్ నంబ‌ర్ వ‌స్తుంది. దాన్ని జాగ్ర‌త్త‌గా రాసి పెట్టుకోవాలి. ఆ త‌రువాత 3-4 రోజుల్లో సంబంధిత బ్యాంకు నుంచి వ‌చ్చే ప్ర‌తినిధికి అన్ని ప్రూఫ్‌లు, ఫొటోలు ఇవ్వాలి. ఆ త‌రవాత మ‌రో 3-4 ప‌నిదినాల్లో కార్డు స్థితి తెలుస్తుంది. ఆ త‌రువాత కార్డు అప్రూవ్ అయితే మ‌రో 7 ప‌నిదినాల్లో చేతికొస్తుంది. ఈ క్ర‌మంలో మొత్తం త‌తంగానికి 15 నుంచి 20 రోజుల వ‌ర‌కు స‌మ‌యం ప‌డుతుంది.

గ్రామీణ బ్యాంకులు, స‌హ‌కార బ్యాంకులు, ఎస్‌బీఐ త‌దిత‌ర బ్యాంకులు కిసాన్ క్రెడిట్ కార్డుల‌ను అందిస్తున్నాయి. రూ.25వేల క్రెడిట్ లిమిట్ కార్డులో వ‌స్తే అలాంటి వారికి చెక్‌బుక్ సౌక‌ర్యం కూడా ఉంటుంది. ఇక ఈ కార్డుల‌కు గ‌రిష్టంగా 3 ఏళ్ల వ‌ర‌కు వాలిడిటీ ఉంటుంది. తీసుకున్న రుణాన్ని 12 నెల‌ల్లోగా చెల్లించ‌వ‌చ్చు. అయితే పంట మార్పిడి, వ్య‌యాలు పెరిగితే కార్డు క్రెడిట్ లిమిట్ కూడా పెంచేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే ప్ర‌కృతి విప‌త్తుల కార‌ణంగా పంట‌ను కోల్పోతే దానికి బీమా ఉంటుంది. ఆ మొత్తం వ‌స్తే మ‌ళ్లీ ఈ కార్డు ద్వారా లోన్ తీసుకోవ‌చ్చు.

కిసాన్ క్రెడిట్ కార్డుల‌ను ఇచ్చే బ్యాంకులు వ‌సూలు చేసే వ‌డ్డీ రేట్లు కూడా భిన్నంగా ఉంటాయి. సాధార‌ణంగా ఈ కార్డుల‌కు 9 శాతం వ‌డ్డీని వ‌సూలు చేస్తారు. ఇక ఈ కార్డుల‌తో గ‌రిష్టంగా రూ.3 లక్ష‌ల వ‌ర‌కు రుణం ల‌భిస్తుంది. క్రెడిట్ హిస్ట‌రీ బాగుంటే వ‌డ్డీరేట్ల‌పై 2 శాతం స‌బ్సిడీ ఇస్తారు. అంటే 7 శాతం వ‌డ్డీ మాత్ర‌మే ప‌డుతుంద‌న్న‌మాట‌. అలాగే అలాంటి వారికి రుణ ప‌రిమితిని కూడా పెంచుతారు. ఇక ఈ కార్డుల ద్వారా రుణం పొందితే బీమా ప్రీమియం, ప్రాసెసింగ్ ఫీజు, పాస్‌పోర్ట్ ఫొటో చార్జిలు, మోర్ట‌గేజ్ చార్జిలు ఉంటాయి. ఈ క్ర‌మంలో కిసాన్ క్రెడిట్‌ కార్డుల ద్వారా జ‌రిపే లావాదేవీల‌కు ఎలాంటి చార్జీలు విధించ‌రు..!

Read more RELATED
Recommended to you

Latest news