సాధారణంగా బ్యాంకులు మనం కట్టాల్సిన ఈఎంఐ సకాలంలో చెల్లించకపోయినా.. ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోయినా.. ఇతర ఏవైనా పనులకు సర్వీస్ చార్జిలు వేసినా.. క్రెడిట్ కార్డు బిల్లులను సరైన టైముకు కట్టకపోయినా.. చార్జిలు, ఫైన్లు, వాటి మీద జీఎస్‌టీలు వేసి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. దీంతో కిక్కురుమనకుండా మనం ఆ చార్జిలను చెల్లించాల్సి వస్తుంది. ఈ క్రమంలో బ్యాంకులు మన ముక్కు పిండి మరీ ఆ చార్జిలను వసూలు చేస్తుంటాయి. అయితే మనం తప్పు చేస్తే బ్యాంకులు అలా చార్జిలను వసూలు చేస్తాయి.. మరి బ్యాంకులు చేసే తప్పులకు వాటినేమనాలి..? ఏటీఎం సెంటర్లలో నగదును సరిగ్గా నింపకపోవడమనేది బ్యాంకులు చేసే తప్పుల్లో ఒకటి. మరందుకు బ్యాంకులకు ఫైన్ లేదా..? అంటే..
ప్రస్తుతం మన దేశంలో చాలా వరకు ఏటీఎంలలో నగదును టైముకు నింపడం లేదు. ఎప్పుడు చూసినా ఏటీఎం సెంటర్లలో నో క్యాష్ అన్న బోర్డులు మనకు కనిపిస్తుంటాయి. దీంతో కిలోమీటర్ల కొద్దీ వెళ్లి మరీ ఉస్సూరుమంటూ వెనక్కి తిరిగి రావల్సి వస్తోంది. అయితే బ్యాంకులు చేసే ఈ తప్పుకు ఇకపై జరిమానా చెల్లించాల్సిందే. అవును నిజమే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే… ఇకపై ఏటీఎం సెంటర్లలో నగదు నింపకుండా గంటల తరబడి అలా నో క్యాష్ బోర్డులు పెడితే కుదరదు. బ్యాంకులకు ఫైన్ వేస్తారు.
ఏటీఎం సెంటర్లలో 3 గంటలకు మించి నో క్యాష్ బోర్డును వేలాడదీస్తే ఆ ఏటీఎంను నిర్వహించే బ్యాంకులకు ఆర్‌బీఐ ఇక ఫైన్ వేయనుంది. అయితే ఈ ఫైన్ కూడా ఏటీఎం సెంటర్ ఉన్న ప్రదేశం, అక్కడ జరిగే లావాదేవీలు.. తదితర అంశాల ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఈ క్రమంలో ఆర్‌బీఐ అమలు చేయనున్న ఈ నిర్ణయం పట్ల బ్యాంకింగ్ వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల కిలోమీటర్ల మేర ఏటీఎంల ముందు బారులు తీరే బాధ తప్పుతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని ఆర్‌బీఐ ఎప్పటి నుంచి అమలు చేయనున్నది.. వివరాలను వెల్లడించలేదు. కానీ త్వరలో దీన్ని అమలు చేస్తారని తెలుస్తోంది..!