దేశంలోని బీమా సంస్థల్లో ఎల్ఐసీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)కి ఎంతగానో పేరుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాలసీలను తన వినియోగదారుల కోసం ఎల్ఐసీ అందుబాటులోకి తెస్తుంటుంది. ఈ క్రమంలోనే త్వరలో ఈ సంస్థ డిజిటల్ దిశగా అడుగులు వేయనుంది. అందులో భాగంగా ఇకపై కస్టమర్లకు సంబంధించిన సమాచారాన్నంతా కేవలం ఎస్ఎంఎస్‌ల రూపంలోనే పంపాలని ఎల్ఐసీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మరో రెండు రోజుల్లో అమలు కానుంది.
మార్చి 1వ తేదీ నుంచి ఇకపై ఎల్ఐసీ పాలసీ హోల్డర్లకు ప్రీమియంకు చెందిన గడువు, చెల్లింపులు, ప్యాలసీ ల్యాప్స్, బోనస్ తదితర సమాచారం అంతా ఆటోమేటెడ్ ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది. ఇదే విషయాన్ని ఎల్ఐసీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇప్పటికే ఎల్ఐసీ పాలసీ హోల్డర్లకు ఈ విషయంపై ఎస్ఎంఎస్‌లను కూడా పంపుతోంది. అయితే ఎస్ఎంఎస్‌లు రావాలంటే ఎల్ఐసీ పాలసీ హోల్డర్లు తమ ఫోన్ నంబర్‌ను అప్‌డేటెడ్‌గా ఉంచుకోవాలి.
మీరు గనక ఎల్ఐసీ పాలసీ హోల్డర్ అయి ఉండి, ఇప్పటికే ఎల్ఐసీ నుంచి గనక మీకు ఎస్ఎంఎస్ రానట్టయితే మీ మొబైల్ నంబర్ ఎల్ఐసీ దగ్గర అప్‌డేట్ అయి లేదని గుర్తించాలి. అలాంటి వారు వెంటనే తమ ఫోన్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. దీంతో వారికి తమ పాలసీలకు చెందిన సమాచారం అంతా మార్చి 1వ తేదీ నుంచి ఎస్ఎంఎస్‌ల రూపంలో అందుతుంది. అయితే పాలసీ హోల్డర్లు తమ ఫోన్ నంబర్‌ను అప్ డేట్ చేయాలంటే.. ఆ వివరాలను తమ ఎల్ఐసీ ఏజెంట్‌కు చెప్పి మార్పించుకోవచ్చు. లేదా ఆన్‌లైన్ లో www.licindia.in/Customer-Services/Help-Us-To-Serve-You-Better అనే లింక్ క్లిక్ చేసి కూడా ఫోన్ నంబర్‌ను అప్ డేట్ చేసుకోవచ్చు. లేదంటే 022-68276827 ఫోన్ నంబర్ కు కూడా కాల్ చేయవచ్చు. కాగా ఎల్ఐసీ మొత్తం 65 రకాల అంశాలకు సంబంధించి తన కస్టమర్లకు ఆటోమేటెడ్ ఎస్ఎంఎస్‌లను పంపనుంది..!