పెళ్లిళ్లలో గొడవలు సహజమే. ఒకరు తాగి వాగుతారు. ఇంకొకరు ఇంకేదో అంటారు. మరొకరు అలుగుతారు. ఇంకొంతమంది భోజనం సరిగ్గా పెట్టలేదంటారు. ఇలా ఏదో ఒక రకంగా గొడవలు మాత్రం అవడం కామన్. అయితే.. భోజనంలో మటన్, చికెన్ సరిగ్గా వేయలేదని కొట్టుకునేవాళ్లను కూడా మనం చూసి ఉంటాం. కానీ.. ఇటువంటి గొడవను మాత్రం ఇప్పటి వరకు మీరు చూసి ఉండరు. ఎందుకంటే.. పెళ్లి భోజనంలో మటన్ పెట్టలేదని బీభత్సంగా కొట్టుకున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు… పదుల సంఖ్యలో కుర్చీలను, బల్లలను విసిరేసుకుంటూ కొట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని ఉప్పుసాకలో చోటు చేసుకున్నది. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు అయిన తర్వాత దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం బయటికి వచ్చింది. పెళ్లి తర్వాత వరుడు తరుపు బంధువులు.. మటన్ తో అన్నం పెట్టాలని వధువు తరుపు బంధువులను డిమాండ్ చేశారు. తమకు అంత ఆర్థిక స్థోమత లేదని.. చికెన్ తో అయితే పెట్టగలమని వధువు తరుపు బంధువులు నచ్చచెప్పినా.. వినకుండా కుర్చీలతో వధువు తరుపు బంధువులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. తర్వాత ఇరు వర్గాల వారు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసుకున్నారట.