సువర్ణావకాశం: లోకేష్ కు బాబుపై ఉన్న విమర్శను పోగొట్టే ఛాన్స్!

-

2019సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి సైకిల్ పంక్చర్ పడిన సంగతి తెలిసిందే. ఆఖరికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు సుపుత్రుడు నారాలోకేష్ కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో మంగళగిరి నియోజకవర్గంలో ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో లోకేష్ ఓడిపోయిన బాదకంటే… “కన్న కొడుకునే గెలిపించుకోలేని దద్దమ్మా” అంటూ అసెంబ్లీలో వైకాపా నేతలు వేసిన పంచులే బాబును మరింత ఎక్కువగా బాదించి ఉంటాయని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. ఈ క్రమంలో బాబుపై ఆ విమర్శను పోగొట్టే అవకాశం లోకేష్ కు వచ్చే సూచనలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు!

టీడీపీకి ఎన్నికల తర్వాత ఉన్న 23మందిలో ముగ్గురు ఎమ్మెల్యేలు అధికారికంగా వైకాపా లో చేరకపోయినా… సైకిల్ అయితే దిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇటు వైకాపా మీటింగుల్లో సెకండ్ సిటిజన్ గా ఉండటం ఏమాత్రం నచ్చకో.. లేక టీడీపీ నుంచి వస్తోన్న “గోపీ” విమర్శనుంచి తప్పించుకోవడానికో తెలియదు కానీ… తన ఎమ్మెల్యే పదవికి రాజినామా చేయాలని భావిస్తున్నారంట వల్లభనేని వంశీ! రాజినామా చేసి ఆమోదింపచేసుకుంటే… ఆరునెలల్లో మళ్లీ ఎన్నికలు వస్తాయి కాబట్టి… ఆ ఎన్నికల్లో గెలవడం ద్వారా “పసుపు రంగు” కడిగేసుకుని అధికారికంగా “ఫ్యాన్ మనిషి” అయిపోవాలని తాపత్రయపడుతున్నారంట!

ఇదే జరిగితే… టీడీపీకి కంచుకోటగా ఉన్న గన్నవరం నియోజకవర్గం నుంచి వంశీకి పోటీగా నారా లోకేష్ ను పోటీచేయిస్తే ఎలా ఉంటుందనేది టీడీపీ నేతల ఆలోచనగా ఉందని అంటున్నారు. లోకేష్ అభిమానులు కూడా ఇదే కోరుకుంటున్నారు. జగన్ పాలన ఏడాది దాటిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కాబట్టి… ఈ ఉప ఎన్నికలో లోకేష్ గెలిస్తే… అది జగన్ సర్కార్ పరిపాలనపై జనం ఇచ్చిన మార్కులుగా భావించొచ్చని… ఫలితంగా మంగళగిరిలో పోగొట్టుకున్న పరువు ఈ గెలుపుతో డబుల్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు! అక్కడకూడా ఓడిపోతే మాత్రం లోకేష్ పరిస్తిహి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు!!

ఈ ఎన్నికల్లో వల్లభనేని వంశీకి కూడా కత్తి మీద సామే! ఈ ఎన్నికల్లో గెలిస్తే… గన్నవరంలో తనకున్నది టీడీపీ ద్వారా సంక్రమించిన వాపు కాదు.. తనకు తాను సొంతంగా ఏర్పరచుకున్న బలుపు అని చెప్పినట్లవుతుంది. అలా కాకుండా ఈ ఉపేన్నికలో ఫలితం రివర్స్ అయితే… రాజకీయ సన్యాసానికి దారితీసే అవకాశాలు లేకపోలేదు అనేది విశ్లేషకుల మాటగా ఉంది! సో… ఈ టఫ్ ఫైట్ లో వంశీ వర్సెస్ లోకేష్… రసవత్తరంగా ఉంటుందనడంలో సందేహం ఉండకపోవచ్చు!

కాబట్టి… ఈ ఉపఎన్నిక జరిగే అవకాశం ఉంటే మాత్రం… లోకేష్ ఇక్కడ పోటీ చేసి… తన తండ్రి పై పడిన ఆ మచ్చను తుడిపేయ్యాలని… మళ్లీ ఇలాంటి సువర్ణావకాశం ఇప్పట్లో రాదని పలువురు అభిప్రాయపడుతున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news