ఏపీలో రాజకీయం ఆసక్తిగా మారుతోంది. కొన్ని సంవత్సరాల వరకు మిత్రులుగా ఉన్నవారు శత్రువులు అవుతున్నారు. శత్రువులుగా ఉన్నవారు మిత్రులు అవుతున్నారు. 2014 ఎన్నికల్లో మిత్రులుగా ఉన్న బీజేపీ, టీడీపీ, జనసేన గతేడాది ఎన్నికల్లో శత్రువులు అయ్యారు. ఇక ఎన్నికలయ్యాక మళ్లీ జనసేన, బీజేపీ మిత్రులు అయ్యారు. ఇక తెలంగాణ ఎన్నికల్లో మిత్రులు అయిన కాంగ్రెస్, టీడీపీ ఆ వెంటనే ఏపీ ఎన్నికల్లో శత్రువులు అయ్యారు. ఇక ఇప్పుడు ఏపీలో మారుతోన్న రాజకీయ పరిణామాల నేఫథ్యంలో అన్ని పార్టీలకు టీడీపీ ప్రధాన శత్రువుగా మారుతోన్నట్టే కనిపిస్తోంది.
తాజాగా నిన్నటి వరకు రాజకీయంగా సైలెంట్‌గా ఉన్న చిరంజీవి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా తన సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు ఎంపికైన వెంటనే ఆయన్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కన్నా కూడా కాపు వర్గానికే చెందిన వ్యక్తి అయినా కన్నా చంద్రబాబు కంట్రల్లోనే నడిచారన్న టాక్ ఉండనే ఉంది. ఇప్పటికే బీజేపీ – జనసేన పొత్తులో ఉన్నాయి. 2024 ఎన్నికల్లో కాపులను అందరిని ఒకే తాటిమీదకు తెచ్చి అధికారంలోకి రావాలన్న టార్గెట్‌తోనే బీజేపీ ఉంది. YSRCP
ఇక కాపుల్లోనూ , యవతలోనూ పవన్‌కు ఉన్న మానియాను వాడుకోవాలని బీజేపీ చూస్తోంది. ఈ క్రమంలోనే చిరు ఓ పెద్ద స్కెచ్‌తోనే వీర్రాజును కలిశారన్న గుసగుసలు కూడా వస్తున్నాయి. బీజేపీ – వైసీపీ మధ్య కూడా సంబంధాలు బాగానే ఉన్నాయి. సోము వీర్రాజుకు చంద్రబాబు అంటే అస్సలు పడదు. ఆయన ముందు నుంచి జగన్‌తో సన్నిహితంగానే ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో వచ్చే నాలుగేళ్లలో జరిగే అన్ని ఎమ్మెల్సీ సీట్లు వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి.
వీటిల్లో ఒకటి బీజేపీ కోటాలో రికమెండేషన్ చేయించుకుని నాగబాబుకు ఇప్పించుకునే విధంగా చిరు రాజకీయం నడుపుతున్నారని అంటున్నారు. భవిష్యత్తులో బీజేపీకి కూడా వైసీపీ అవసరం ఉంది. రాజ్యసభలో బీజేపీ బలం తక్కువుగా ఉండడంతో వైసీపీ సపోర్ట్ అవసరం. అందుకే ఇరు పక్షాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఇప్పుడు దీనిని వాడుకుని వైసీపీ నుంచి బీజేపీ కోటాలో తీసుకునే ఎమ్మెల్సీ సీటునే నాగబాబుకు ఇప్పించుకోవాలన్నదే మెగాస్టార్ స్కెచ్ అట. మరి ఈ స్కెచ్ ఎంత వరకు నెరవేరుతుందో ? చూడాలి.