రాజకీయాల్లో నిర్ణయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అవకాశం, అవసరం అనే రెండు కీలకపాయింట్ల ఆధారంగా నాయకులు, పార్టీల అధినేతలు కూడా అడుగులు వేస్తుంటారు. ఇది ఎక్కడైనా జరిగేదే. పార్టీలో ఈ పరిణామాలు ఎప్పుడైనా జరిగేవే. ఇవే పరిణామాలు ఇప్పుడు అధికార పార్టీ వైఎస్సార్ సీపీలోనూ జరుగుతున్నాయి. పార్టీ అధినేత, సీఎం జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పార్టీని గాడిలో పెట్టాలన్నా.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి కుంభస్థలంగా ఉన్న నియోజకవర్గాల్లో సైతం పాగా వేయాలన్నా.. వ్యూహాత్మకంగా పావులు కదపాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇదే ఇప్పుడు ప్రకాశం జిల్లాలోనూ అవలంబిస్తున్నారు జగన్.
ప్రకాశం జిల్లా చీరాలలో గత ఏడాది ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఓడిపోయింది. దీంతో ఇక్కడ గెలిచిన టీడీపీ నాయకుడు, సీనియర్ నేత కరణం బలరాం.. తన కుమారుడు కరణం వెంకటేష్ భవిత కోసం.. అంటూ.. వైఎస్సార్ సీపీలోకి చేరిపోయారు. దీంతో చీరాలలో ఎమ్మెల్యే కరణం వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ఆమంచి మధ్య వార్ నడుస్తోంది. వాస్తవానికి కరణం చీరాల ఎమ్మెల్యేగా గెలిచినా ఆ ఫ్యామిలీకి ఇక్కడ అంతగా పట్టులేదు. కరణంకు అద్దంకి నియోజకవర్గంలో గట్టి పట్టు ఉంది. అక్కడ ఇప్పటికే సీనియర్ నేత బాచిన కృష్ణచైతన్య ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఇక టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సైతం రేపో మాపో వైసీపీలోకి వస్తారని అంటున్నారు. అదే జరిగితే అద్దంకిలో గొట్టిపాటి, బాచిన గ్రూపులు ఉంటాయి. అక్కడ కరణంకు శాశ్వతంగా అవకాశాలు ఉండవు.
దీంతో వైసీపీ అధిష్టానం ముందు కరణం, ఆమంచి మధ్య సయోధ్య కోసం ఆమంచి కృష్ణమోహన్‌ను పరుచూరు నియోజకవర్గానికి వెళ్లాలని, చీరాలలో కరణంను కంటిన్యూ చేయాలని భావించింది. అయితే కరణంకు చీరాలలో ఉండడం కూడా మనస్ఫూర్తిగా ఇష్టంలేదు. ఆయన మనసంతా అద్దంకి మీదే ఉన్నా అక్కడ ఛాన్స్ ఉండే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే కమ్మ వర్గం ఎక్కువుగా ఉన్న పరుచూరులో తనకంటే కరణం అయితేనే కరెక్ట్ అని.. చీరాలలో తాను రెండుసార్లు గెలవడంతో పాటు ఇండిపెండెంట్‌గా గెలిచానని ఆమంచి చెప్పడంతో ఇప్పుడు జగన్ సరికొత్త ప్లాన్‌తో ఈ సమస్యను పరిష్కరించినట్టు జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలో ఆలోచన చేసిన జగన్.. ప్రస్తుతం చీరాల ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ నాయకుడు, దాదాపు ముప్పయ్యేళ్లకు పైగా రాజకీయాలు చేస్తున్న కరణం బలరాంనే పరుచూరుకు వెళ్లాలని సూచించారట. పైగా ఆయనకు జిల్లా మొత్తం కొట్టిన పిండి కావడం, పరుచూరులో టీడీపీ నుంచి వరుసగా రెండుసార్లు గెలుస్తోన్న కమ్మ వర్గానికి చెందిన ఏలూరును ఢీకొట్టాలంటే కరణమే కరెక్ట్ అని జగన్ డిసైడ్ అయ్యారట. పైగా పరుచూరులో గతంలో కరణం ఓ సారి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు ( అప్పటి మార్టూరు ఇప్పుడు పరుచూరులో ఉంది ). గతంలో అద్దంకిలోనూ .. ఇప్పుడు చీరాలలోనూ ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. వీటన్నింటికీ తోడు.. పరుచూరులో కమ్మ వర్గాన్ని తనవైపు తిప్పుకోవడంలోను కరణం అయితేనే బెటరని జగన్ భావించారని అంటున్నారు. దీంతో ఆమంచిని చీరాలకే పరిమితం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలతో ఆమంచి వర్గం ఖుషీగా ఉంది. కరణం.. రేపో మాపో పరుచూరుకు వెళ్లనున్నారని సమాచారం.