ఆకస్మికంగా కురిసిన ఆకాశం మాదిరిగా.. టీడీపీ సీనియర్ నాయకుడు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి జగన్ సర్కారుపై విరుచుకుపడ్డారు. వాస్తవానికి ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు, విమర్శలు గతానికి చాలా భిన్నంగా సాగాయని అంటున్నారు పరిశీలకులు. బుచ్చయ్యను పరిశీలిస్తే.. గడిచిన ఏడాదిన్నర కాలంలో ఈ రేంజ్‌లో జగన్‌పై ఆయన విరుచుకుపడిన సందర్భం కానీ.. అవసరం కానీ.. మనకు కనిపించదు. పైగా టీడీపీలోనే ఉన్నప్పటికీ.. ఆయన అసంతృప్తితో ఉన్నారు. గత బాబు హయాంలోనే ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, గత ఏడాది జగన్ సునామీని తట్టుకుని నిలబడిన బుచ్చయ్యకు మరోసారి అవమానం జరిగిందనే వాదన కూడా రాజమండ్రి పొలిటికల్ సర్కిళ్లలో తరచుగా వినిపిస్తూనే ఉంటుంది.
పోనీ.. గెలిచిన తర్వాత కూడా చంద్రబాబు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వకుండా బుచ్చయ్యకు ప్రాధాన్యం లేకుండా చేశారని ఆయన వర్గం నేతలు ఇప్పటికీ అంతర్గతంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొన్నాళ్ల కిందట బుచ్చయ్య ఆఫ్ దిరికార్డుగా మీడియా మిత్రులతో మాట్లాడుతు.. నేను గెలిచాను కాబట్టి.. కనీసం గుర్తుపెట్టుకున్నారు సోదరా ? లేకపోతే.. ఎప్పుడో మరిచిపోయేవారు…! అని ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబుపై అసహనం వ్యక్తం చేశారు. అలాంటి నాయకుడు ఒక్కసారిగా జగన్‌పై విరుచుకుపడడం, నిప్పులు చెరగడం, మీకులపోళ్లకు పదవులు ఇచ్చుకునేందుకే అధికారంలోకి వచ్చావా? కమ్మోళ్లు నీకు చేసిన అన్యాయం ఏంటి ? అని నిలువునా కడిగేయడం పొలిటికల్ సర్కిళ్లలో చాలా ఆశ్చర్యం కలిగించింది.
దీనిపై కూపీలాగగా.. గోరంట్ల వ్యాఖ్యలు, విమర్శలు, రెచ్చిపోవడం వెనుక చంద్రబాబు.. లోకేష్‌ల బలవంతం ఉందని తాజాగా తెలుస్తోంది. `ఎంతసేపూ మేమే మాట్లాడుతున్నాం. మేమే విమర్శిస్తున్నాం. మీరు ఏం చేస్తున్నారు. పార్టీ టికెట్ తీసుకుని గెలిస్తే.. చాలా ? ఇప్పటికైనా ఏదో ఒకటి మాట్లాడండి` అంటూ బుచ్చయ్యపై ఒత్తిడి చేశారనే ప్రచారం సాగుతోంది. అయితే, దీనికి కౌంటర్‌గా మరో వ్యాఖ్యకూడా వినిపిస్తోంది. ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడే బుచ్చయ్యను బాబు బెదిరించారు ? అని ప్రశ్నిస్తున్నారు తమ్ముళ్లు.
ఇప్పటికే ఉన్న కమ్మ వర్గం నాయకులు చాలా మంది మాట్లాడారు. అయినా.. కూడా ఎవరూ వారి వ్యాఖ్యలను లెక్కబెట్టే పరిస్థితి లేదు. దీంతో బుచ్చయ్య వంటి సీనియర్‌ను రంగంలోకి దింపడం ద్వారా.. ఎంతో కొంత తన లక్ష్యాన్ని సాధించుకోవచ్చని చంద్రబాబు భావిస్తున్నారని అంటున్నారు. మరి ఏదేమైనా బుచ్చయ్య వ్యాఖ్యలకు ప్రాధాన్యం బాగానే లభించింది.