రాజు గారిపై వేటు వేస్తారా ? మేలు చేస్తారా ?

-

జగన్ ప్రభుత్వాన్ని అదేపనిగా విమర్శిస్తూ, ఆ పార్టీకి అలజడి రేపుతున్నారు నరసాపురం వైసీపీకి రఘురామకృష్ణంరాజు. ఎక్కడా తన దూకుడును తగ్గించడం లేదు. ఏదో ఒక అంశం పై వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూనే వస్తున్నారు. అమరావతి మొదలుకొని అంతర్వేది వరకు ఏ వ్యవహారాన్ని వదిలిపెట్టకుండా, విమర్శలు చేస్తూనే వస్తున్న తీరుతో కంగారుపడిన వైసిపి ప్రభుత్వం మొదట్లో కాస్త గట్టిగానే కౌంటర్ లు ఇచ్చినా, ఆ తర్వాత ఆయన సంగతి పూర్తిగా పక్కన పెట్టేసింది. ఆయన ఎంత తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నా, స్పందించడం లేదు. ఇది ఇలా ఉంటే, రఘురామకృష్ణంరాజు మొదట్లో అసమ్మతి గళం వినిపించిన సమయంలోనే వైసిపి ఎంపీలు ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్లి ఆయనపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఆయనపై అనర్హత వేటు వేయాల్సింది గా కోరారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం లోక్ సభ స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉంది. కొద్ది రోజుల క్రితం బీజేపీ పైన రాజు గారు విమర్శలు చేయడంతో, సోము వీర్రాజు గట్టిగానే ఆయనకు షాక్ ఇచ్చి, మీ పని మీరు చూసుకోండి అని, ఉచిత సలహాలు ఇవ్వద్దని చురకలు వేశారు. ఇదంతా పాత సంగతి. ఇక ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడంతో మరోసారి రఘురామకృష్ణరాజు వ్యవహారం తెరపైకి వచ్చింది. ఆయనపై అనర్హత వేటు వేస్తారా అనే విషయం ఇప్పుడు తెరపైకి వస్తుంది. త్వరలో జరగబోయే వైసిపి పార్లమెంట్ కమిటీ సమావేశంలోనూ, దీనిపై చర్చించబోతున్నారు. కొద్దిరోజులుగా రఘురామకృష్ణంరాజు మరింత దూకుడు విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీలో మీడియా సమావేశాలు నిర్వహించి జాతీయ స్థాయిలో వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తుండడంతో, వైసిపి ఆయన తీరుపై ఆగ్రహంగానే ఉంది.
జగన్ రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో సీరియస్ గా ఉండడంతో పాటు, ఆయనపై అనర్హత వేటు వేయించడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలతో మంతనాలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే లోక్ సభ సమావేశాలు ప్రారంభం అవుతుండడంతో  మరోసారి స్పీకర్ ను కలిసి అనర్హత వేటు విషయంపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్లు  తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బీజేపీకి వైసిపి ఎంపీల మద్దతు చాలా అవసరం. ఈ తరుణంలో రఘుురామకృష్ణంరాజు పై వేటు వేస్తారా ? లేక ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటారా అనేది తేలాల్సి ఉంది.
-Surya

Read more RELATED
Recommended to you

Latest news