రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. 2021-22 సంవత్సరానికి ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లోక్‌సభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రకటన చేశారు. కనీస మద్దతు ధర తొలగించబడుతుందనే అపోహలు, అనుమానాల నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం రైతులకు స్పష్టమైన సానుకూల సందేశం ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ మద్దతు ధర పెంచినట్టు చెబుతున్నారు.
ఇక కనీస మద్దతు ధరలు ఇలా ఉన్నాయి. గోధుమ పంట కనీస మద్దతు ధర రూ.50 పెంచడం వల్ల క్వింటాల్ రూ.1,975కు చేరింది. శనగలు క్వింటాలుకు రూ.225, మసూర్ దాల్ క్వింటాలుకు రూ.300, ఆవాలు క్వింటాలుకు రూ.225, బార్లీ క్వింటాలుకు రూ.75, కుసుమలు క్వింటాలుకు రూ.112 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చినా కనీస మద్దతు ధర కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవడం, వ్యాపారులతో ముందస్తు ఒప్పందం చేసుకోవడం లాంటి వ్యవసాయ ఆధారిత ల్లులు పార్లమెంటులో ఆమోదం పొందిన విషయం తెలిసిందే.