రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం. ఎవరికి అవసరం ఉంటే.. వారు తమకు అనుకూలంగా రాజకీయాలను మార్చుకుంటున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు కేంద్రం కూడా తమకు అవసరం కనుక.. ఏపీలోని అధికార పార్టీ వైసీపీతో చెలిమి చేస్తోంది. ఏపీలోని జగన్‌కు మైత్రిగా కూడా వ్యవహరిస్తోంది. కీలకమైన వ్యవసాయ బిల్లుకు రాజ్యసభలో వైసీపీ మద్దతివ్వడం, ఏపీలో రైతులు వినియోగించే వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు పెట్టేందుకు కూడా జగన్ ఓకే చెప్పడం.. దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా ముందుకు తీసుకు వెళ్లడం తెలిసిందే.
ఈ క్రమంలోనే జగన్ మోడీకి చాలా చేరువయ్యారు. అనేకమంది మిత్రులు సైతం వ్యతిరేకించినా.. జగన్ మాత్రం మోడీకి జై కొట్టారు. పైగా.. దీనిపై వ్యతిరేకత వస్తుందని, ఖచ్చితంగా వ్యవసాయ మీటర్ల వ్యవహారం తనకు, తన ఓటు బ్యాంకుకు విఘాతం కలిగిస్తుందని తెలిసి కూడా మోడీ నిర్ణయానికి జగన్ ఓకే చెప్పారు. ఇంత వరకు బాగానే ఉంది. జగన్‌ను మోడీ వాడుకున్నారు ఒడ్డెక్కారు. అయితే, ఇప్పుడు జగన్‌కు మోడీ ఏమేరకు హెల్ప్ చేస్తారు ? ఏమేరకు ఆయనకు జై కొడతారు ? అనేది కీలకంగా మారింది.
వాస్తవానికి ఇప్పుడు కేంద్రంతోనే జగన్ వ్యవహారాలన్నీ ముడిపడి ఉన్నాయి. రాష్ట్రంలో జగన్ ఏవిధంగా ముందుకు సాగాలన్నా. మోడీ ఆశీస్సులు తప్పనిసరి.. ! ప్రత్యేక హోదా విషయాన్ని పక్కన పెట్టినా.. కనీసం.. మూడు రాజధానుల విషయానికి జైకొట్టాల్సిన అవసరం, శాసన మండలి రద్దుపై నిర్ణయం తీసుకోవడం, వెనుకబడిన జిల్లాలకు నిధులు.. పోలవరం ప్రాజెక్టు పూర్తికి సహకరించడం, జిల్లాల ఏర్పాటు, విభజన హామీలు, అంతకుమించి.. జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం.. వంటివాటిని కూడా పరిష్కరించాల్సిన బాధ్యత మోడీపై ఉంది.
ఈ క్రమంలో రాష్ట్రంలో తన పేరును మరింత పెంచుకునేందుకు జగన్‌కు ఆయా కార్యక్రమాలు సాధించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మోడీ అవసరం ఇప్పుడు జగన్‌కు ఉంది. మరి ఆయన ఏమేరకు జగన్‌కు జై కొడతారో? ఎలా సహకరిస్తారో.? అనే అంశాలు కీలకంగా మారాయి. ఏం జరుగుతుందో చూడాలి.జగన్ మోడీకి జై కొట్టడం ఓకే… మోడీ ఈ సాయం చేస్తారా..!