కృష్ణా జిల్లా గన్నవరం రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. నిన్నటి వరకు ఇక్కడ టీడీపీ నుంచి వైసీపీ సానుభూతి పరుడిగా మారిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్సెస్ 2014 వైసీపీ అభ్యర్థి దుట్టా రామచంద్రరావు వర్గాల మధ్య ప్రతి రోజు నడుస్తోన్న వార్ ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. గత ఎన్నికల్లో వంశీపై పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావుకు జగన్ కృష్ణా డీసీసీబీ చైర్మన్ పదవి ఇవ్వడంతో ఆయన సైలెంట్ అవ్వడంతో పాటు గన్నవరంలో తన పార్టీ ఆఫీస్‌ను ఖాళీ చేసి విజయవాడకు జంప్ అయిపోయారు. సో వెంకట్రావు గన్నవరంలో యాక్టివ్‌గా లేకపోవడంతో వంశీ వర్సెస్ దుట్టా వర్గాల మధ్య నడుస్తోన్న వార్ ఇప్పుడు వెంకట్రావు ఎంట్రీతో సరికొత్తగా యూ టర్న్ అవుతోంది.
తాజాగా గన్నవరం గొడవపై స్పందించిన యార్లగడ్డ వంశీపై తీవ్ర విమర్శలు చేశారు. గన్నవరం వైసీపీలో గ్రూపులు లేవని చెప్పిన ఆయన తాను ఎమ్మెల్యే వంశీతో కలిసి పనిచేయలేనని సీఎం జగన్‌కే చెప్పానని అన్నారు. వంశీ గతంలో తనను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడంతో పాటు కార్యకర్తలను ఎంతో వేధించారని యార్లగడ్డ చెప్పారు. నియోజకవర్గంలో పలు గ్రామాల్లో తన జన్మదిన వేడుకలు కూడా జరపవద్దని వంశీ హెచ్చరిస్తున్నారని యార్లగడ్డ చెప్పారు.
ఇక నియోజకవర్గంలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేయడంతో పాటు మంత్రి, ఎమ్మెల్యే ఒత్తిడి ఉందని కూడా చెపుతున్నారని.. ఈ విషయంలో వీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని యార్లగడ్డ హెచ్చరించారు. యార్లగడ్డ వ్యాఖ్యలతో గన్నవరం వైసీపీ రాజకీయాలు మరింత హీటెక్కాయి. వంశీని టార్గెట్ చేసే విషయంలో నిన్నటి వరకు దూకుడుగా ఉన్న దుట్టాకు తోడు ఇప్పుడు యార్లగడ్డ కూడా రావడంతో గన్నవరంలో వంశీ రాజకీయం చేయడం అంత సలువు కాదని తెలుస్తోంది.
వంశీ తాను అందరిని కలుపుకుని పోతానని చెపుతున్నా వైసీపీలో రెండు బలమైన వర్గాలు మాత్రం వంశీకి ఎట్టి పరిస్థితుల్లోనూ సపోర్ట్ చేసే ప్రశక్తే లేదని చెపుతున్నాయి. మరోవైపు టీడీపీ ఇక్కడ పగ్గాలను ఎమ్మెల్సీ బచ్చుల అర్జనుడికి ఇవ్వడంతో బీసీ అస్త్రాన్ని వంశీపై ఎక్కు పెట్టినట్లయ్యింది. ఈ పరిణామాలు ఇక్కడ వంశీ గడ్డు పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయి.
-Vuyyuru Subhash