ఒకప్పుడు వామపక్ష పార్టీలకు ఉమ్మడి ఏపీలో మంచి పట్టు ఉండేది. అలాగే వారు చేసే పోరాటాలకు ఓ విలువ ఉండేది. ప్రభుత్వాల సైతం వారి పోరాటాలకు తలోగ్గేవి. కానీ రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అటు తెలంగాణ, ఇటు ఏపీలో కమ్యూనిస్టులు పూర్తిగా కనుమరుగమయ్యే స్థితికొచ్చేశారు. ముఖ్యంగా ఏపీలో కమ్యూనిస్టులకు అసలు ప్రాధాన్యత లేదు. పైగా సిపిఎం, సిపిఐలు విడివిడిగా రాజకీయం చేస్తున్నాయి.
అయితే ప్రస్తుతం సీపీఐ మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబుకు బాకా ఊదుతుంది. చంద్రబాబు మాదిరిగానే జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. అమరావతి కోసం పోరాటం చేస్తున్నారు. కానీ వీరి విమర్శలని అధికార వైసీపీ మాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా మాత్రం మంత్రి కన్నబాబు సిపిఐకు చురకలు అంటించారు. అమరావతి రెఫరెండంగా ఎన్నికలకు వెళ్లాలని సిపిఐ నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కన్నబాబు స్పందిస్తూ…గత ఎన్నికల్లో సీపీఐ, టీడీపీతో కలిసి ఎందుకు పోటీ చెయ్యలేదు ? చంద్రబాబుపై నమ్మకం లేకే కదా ? అని ప్రశ్నించారు.
ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు వెళ్లమంటున్నారు.. వెళ్తే సీపీఐకి 100 సీట్లు ఏమైనా వస్తాయా ?. చంద్రబాబు ఏమి మాట్లాడమంటే.. సీపీఐ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. వాస్తవానికి చూస్తే గత ఎన్నికల్లో బాబు మీద నమ్మకం లేకే సిపిఐ, జనసేనతో కలిసి, ఎన్నికలకు వెళ్ళి డిపాజిట్లు దక్కించుకోలేదు. అయితే ఎన్నికలయ్యాక జనసేన బీజేపీతో కలిస్తే, సిపిఐ టీడీపీతో అంటకాగుతుంది.
ఇలా టీడీపీతో ముందుకెళ్తే కనీసం రెండో,మూడో సీట్లు వస్తాయని ఉద్దేశంతో సిపిఐ ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే టీడీపీ నేతలు కంటే ఎక్కువగానే సిపిఐ నాయకులు జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. అయితే టీడీపీ నేతల విమర్శలనే జనం పట్టించుకోవడం లేదు. అలాంటిది కనుమరుగైపోతున్న సిపిఐ నేతల మాటలు పట్టించుకుని ప్రజలు, జగన్ ప్రభుత్వంపై నెగిటివ్ పెంచుకునే అవకాశం లేదు.
-vuyyuru subhash