ఏపీ బీజేపీలో చేరేవారికంటే పార్టీలో ఉన్నవాళ్లను సస్పెండ్ చేయడమే ఎక్కువైందట. క్రమశిక్షణ పేరుతో ఒక్కో నేతపై వేటు వేస్తోంది పార్టీ అధిష్ఠానం. గత 3నెలల కాలంలో అరడజను మందిని పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేయడమో.. నోటీసులు ఇవ్వడమో చేసింది. ఈ తరహా చర్యలకు దారితీసిన పరిస్థితులు.. ఆయా నేతలు చేసిన తప్పులు చూస్తే మాత్రం కాస్త కొత్తగా అనిపిస్తోందట. అనుమతి లేకుండా టీవీ చర్చలకు వెళ్లడమే కారణంగా చెబుతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఏపీ బీజేపీ సారథిగా ఉన్న సమయంలోనూ ఇలా కొందరికి నోటీసులు ఇచ్చి వివరణ కోరారు. ఒకరిద్దరిని సస్పెండ్ చేశారు. ఇప్పుడు సోము వీర్రాజు సమయంలో ఇవి మరింత స్పీడ్ అయ్యాయి.
బీజేపీలో అమరావతి అంశంపైనే ప్రధాన సమస్య తలెత్తుతోంది. ఎవరి ఇష్ట ప్రకారం వారు అభిప్రాయాలు వ్యక్తం చేయడం సరికాదని సోము వీర్రాజు పలుమార్లు స్పష్టం చేశారు. పార్టీ లైన్‌కు భిన్నంగా ఎవరు మాట్లాడినా అంగీకరించేది లేదని చాలా క్లియర్‌గా చెప్పేశారు. ఈ లక్ష్మణ రేఖను దాటారనే కారణంతో గతంలో వెలగపూడి గోపాలకృష్ణ, రామకోటయ్య తదితరులపై చర్యలు తీసుకున్నారు. ఈ జాబితాలో లంకా దినకర్ కూడా చేరిపోయారు.
గత జులైలో లంకా దినకర్ టీవీ చర్చల్లో పాల్గొన్నారని అప్పట్లోనే నోటీసు ఇచ్చారు. ఆ నోటీసుకు కన్నా సమయంలోనే వివరణ ఇచ్చానని దినకర్ చెబుతున్నారు. అయినా ఇప్పుడు గతాన్ని ఎందుకు తవ్వారన్నది పార్టీలో చర్చ జరుగుతోందట. ఇదే సమయంలో పార్టీలో మరో టాక్ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తీసుకుంటున్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే టీవీ డిబేట్ల ద్వారా తమకు మంచి పేరు వస్తోందని దానికి భయపడే పార్టీలో కొందరు కుట్రలు చేస్తున్నారని వేటుపడ్డవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.
ఈ వ్యవహారంపై పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి ఏకంగా ఒక ప్రకటన ఇచ్చారు. తాము చెప్పిన వాళ్లనే చర్చలకు పిలవాలని.. తమ పార్టీ అయినా వేరేవాళ్లను పిలవొద్దని అందులో మీడియాను ఉద్దేశించి అన్నారు విష్ణు.కాకపోతే ఈ మధ్యకాలంలో ఏపీ బీజేపీలో జరిగిన చేరికల కంటే సస్పెన్షన్లే ఎక్కువగా ఉన్నాయని సెటైర్లు వినిపిస్తున్నాయి. టీవీ చర్చలకు వెళ్లేవారిని కట్టడి చేయలేకే సస్పెన్షన్లు అనే కొత్త సంప్రదాయం తీసుకొచ్చారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.