చిన్నప్పటి నుంచీ దేశభక్తి ఎక్కువ. ఆర్మీలో చేరాలనే పట్టుదల. ఆ పట్టుదలతోనే జవాన్ అయ్యాడు. భరతమాత రక్షణ బాధ్యత తీసుకున్నాడు. కానీ కెరీర్‌లో ఎదుగుతున్న క్రమంలో టెర్రరిస్టుల తూటాలకు ఎదురెళ్లి బలైపోయాడు. ఇదీ నిజామాబాద్ జిల్లాకు చెందిన వీర జవాన్ మహేశ్. జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మాచిల్ సెక్టారులో టెర్రరిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేష్ చనిపోయాడు.
ర్యాడా మహేష్ స్వస్థలం నిజామాబాద్ జిల్లా కోమన్‌పల్లి గ్రామం. వ్యవసాయ కుటుంబానికి చెందిన మహేష్ ఆర్మీలో చేరాలన్న లక్ష్యంతో కష్టపడి 2014లో ఎన్నికయ్యాడు. శిక్షణ ముగిశాక అసోం… తర్వాత డెహ్రడూన్‌లో విధులు నిర్వర్తించాడు. హైదరాబాద్‌కు చెందిన ఆర్మీకమాండర్ కూతురు సుహాసినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గత ఏడాది డిసెంబరులో స్వగ్రామానికి వచ్చిన అతడు… తిరిగి అదే నెలలో వెళ్లిపోయాడు. జమ్ము కశ్మీర్‌లో అప్పటి నుంచి డ్యూటీలో ఉన్నాడు. పెట్రోలింగ్ నిర్వహించేందుకు సహచరులతో వెళ్తున్నట్టు ఫోన్ చేసి తన కొడుకు చెప్పాడని… అవే చివరి మాటలు అని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. మహేశ్ భౌతికకాయాన్ని స్వస్థలానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.