దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన ఉత్తరాది రాష్ట్రం బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితం వచ్చేసింది. ఆది నుంచి అందరూ భావిస్తున్న ఆర్జేడీ యువ నాయకుడు తేజస్వి యాదవ్ సర్కారు ఏర్పాటు చేస్తారని అనుకున్నా.. బిహార్ ఓటరు తీర్పు మాత్రం దీనికి భిన్నంగా సాగింది. మరోసారి నితీశ్‌కే ప్రజలు పగ్గాలు అప్పగించారు. అయితే, తేజస్వి అధికారంలోకి రాకపోయినా.. నైతికంగా మాత్రం ఆయన ఓటరు నాడిని పట్టుకున్నారు. ఈ విషయంలో ఆయన విజయం సాధించారనే చెప్పాలి. దీనికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి.
బీజేపీ-జేడీయూ కూటమి తరఫున కేంద్ర మంత్రులు వాలిపోయి మరీ బిహార్‌లో ప్రచార పర్వం ప్రారంభించారు. మొత్తం 12సభల్లో ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వంటివారు నిత్యం ఇక్కడ తీరును పరిశీలిం చారు. దీంతో బిహార్ ఎన్నికల్లో ఈ రేంజ్‌లో హేమాహేమీలు ప్రచారానికి దిగినట్టయింది. అదే సమయంలో ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమికి యువ నేత తేజస్వి మాత్రమే పెద్ద దిక్కుగా మారాడు. సుడిగాలి పర్యటన చేశాడు. యువతను ఆకర్షించే ప్రయత్నం చేశారు.
నిజానికి నితీశ్ వంటి సీనియర్ నాయకుడు కూడా ఉద్యోగ కల్పనపై హామీ ఇవ్వలేక పోయారు. కానీ, తేజస్వి మాత్రం 15 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో సఫలీ కృతులయ్యార నడంలో సందేహం లేదు. అయితే, చివరి నిమిషంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రచారం బిహార్ ఎన్నికలపై ప్రభావం చూపింది. దీంతో తేజస్వి కూటమి ప్రతిపక్షానికి పరిమితమైనా.. సమీప భవిష్యత్తులో మాత్రం.. తేజస్వి నాయకత్వం బలపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఆయన కూటమిగానే వెళ్లాల్సిన అవసరం లేదు. సొంతగా బరిలోకి దిగినా.. గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమనే అంచనాలు వస్తున్నాయి. 2014లో ఏపీ ఎన్నికల్లో జగన్ ఏవిధంగా అయితే.. ఓడిపోయి.. తిరిగి గత ఏడాది ఎన్నికల్లో సత్తా చాటారో.. ఇప్పుడు ఇదే తరహా పరిస్థితి తేజస్వికి ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. పైగా నితీశ్ కూడా ఈ ఎన్నికలే తనకు ఆఖరు అని ప్రకటించిన నేపథ్యంలో తేజస్వికి ఫ్యూచర్ ఖాయమనే విశ్లేషణలు వస్తున్నాయి.