గంటా రాజకీయ భవిష్యత్ కి పొగబెడుతుంది వీరేనా ?

-

విశాఖజిల్లాలో అధికారపార్టీ వ్యూహాలు తలపండిన నేతలకు అంతు చిక్కడం లేదు. వలసలను ప్రోత్సహిస్తున్న తరుణంలో వేస్తున్న ఎత్తుగడలు రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇందుకు మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిస్థితే నిదర్శనం. పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండటంతో.. టీడీపీ అధిష్ఠానం సైతం గంటాకు అంతే దూరం పాటిస్తోంది. రేపో మాపో కండువా మార్చేయడమే తరువాయి అన్న ప్రచారం భారీస్ధాయిలో జరిగింది. కానీ యవ్వారం ఎక్కడో తేడా కొట్టింది. వస్తానంటే ఊకొట్టిన వాళ్లే ఇప్పుడు రాకుండా పొగబెడుతున్నారు..

వైసీపీవైపు గంటా చూస్తున్నారనే ప్రచారం ఊపందుకోవడంతో ఆయన ప్రత్యర్థులు యాక్టివ్‌ అయ్యారు. ఒకప్పుడు గంటా ప్రాతినిథ్యం వహించిన భీమిలి నుంచే నిరసనల పొగ బెట్టారు. గంటా రాకను తీవ్రంగా వ్యతిరేకించారు మంత్రి అవంతి శ్రీనివాస్‌. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సైతం సైకిళ్ల స్కామ్‌ను ప్రస్తావించి బహిరంగ వేదికపైనే విమర్శలు గుప్పించారు. ఆరు నెలలుగా ఎవరినీ కలవకుండా ఇంటకే పరిమితమయ్యారు గంటా.

ఈ మధ్యే ఆయన పార్టీ మార్పుపై మళ్లీ చర్చ మొదలైంది. అక్టోబరులో రెండు మూడు ముహూర్తాలు ప్రచారం జరిగినప్పటికీ అవేమీ వర్కవుట్‌ కాలేదు. అమరావతి పెద్దల దగ్గర నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చేసిందని గట్టిగా ప్రచారం జరగడంతో స్థానిక నాయకత్వం సైతం గంటా పార్టీలోకి రావడం ఖాయమని ఫిక్స్‌ అయింది. వైసీపీలో చేరితే తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నార్త్‌ స్థానానికి రాజీనామా చేయడానికి సిద్ధమని గంటా చెప్పినట్టు సమాచారం. అంతా ఓకే అనుకున్న సమయంలోనే కొత్త ట్విస్ట్‌ మొదలైంది. విశాఖలో భూ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల తొలగింపు వ్యవహారం మాజీ మంత్రి గంటా, ఆయన అనుచరుల కేంద్రంగా జరుగుతోందనే అభిప్రాయం కలుగుతోంది.

గతవారం కృష్ణరాయపురంలోని సుమారు 120 ఎకరాల ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను రెవెన్యూ యంత్రాంగం తొలగించింది. వీటిలో 4.8 ఎకరాల భూమి గంటాకు చెందినది. ప్రత్యూష కంపెనీ పేరు మీద 1997లో ఈ ఆస్తిని గంటా కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన పక్కా రిజిస్ట్రేషన్లు ఉన్నాయని ప్రత్యూష వర్గాలు చెబుతున్నాయి. పైగా రాజకీయాల్లోకి రాకముందు కొనుగోలు చేసిన భూమికి ఆక్రమణల ముద్ర వేయడం గంటాకు మింగుడుపడటం లేదట.
ఈ అంశంపై గంటా ఆరా తీస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ యంత్రాంగం చర్యను కోర్టులో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారట. అంతేకాదు గంటాకు చెందిన భూములను స్వాధీనం చేసుకున్నామనే ప్రచారం ద్వారా తనను నెగెటివ్‌ చేయడానికి చూస్తున్నారనే అభిప్రాయం ఆయనలో కనిపిస్తోందట.

అయితే కొందరు అధికారపార్టీ పెద్దల దగ్గర ఈ వ్యవహారం చర్చకు వచ్చిందని వినికిడి. తమ నోటీసులో లేకుండానే జరిగిపోయిందని కొందరు ప్రముఖులు గంటాకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారట. ఏదో జరిగిపోయిందని గంటా సరిపెట్టుకునే సమయంలో జీవీఎంసీ అధికారులు మరో దెబ్బ కొట్టారు. ఈసారి గంటా ముఖ్య అనుచరుడు కాశీవిశ్వనాథ్‌కు చెందిన గోకార్టింగ్ సంస్థ కట్టడాలను కూలగొట్టారు. గంటా భీమిలి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో టూరిజమ్‌లో భాగంగా దీనిని ప్రమోట్ చేశారు. అయితే.. నిబంధనలు పాటించలేదనే కారణంతో ఇప్పుడు కూల్చివేతలకు దిగడం హాట్ టాపిక్‌గా మారింది.

వారం రోజుల వ్యవధిలో గంటా, ఆయన అనుచరులకు సంబంధించిన భూములను కదిలించడంతో ఈ వ్యవహారంపై రాజకీయంగా చర్చ మొదలైంది. పార్టీలోకి వస్తారనే ప్రచారం పీక్స్‌కు చేరుకున్న సమయంలో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లేలా అధికారుల చర్యలు ఉన్నాయని భావిస్తోందట గంటా వర్గం. గంటా సైతం కాస్త స్ట్రాంగ్‌గానే ఫిక్స్ అవుతున్నారని తెలుస్తోంది. డిసెంబర్‌ 1న ఆయన బర్త్ డే ఉంది. ఆ తర్వాత రాజకీయంగా యాక్టివేట్ కావాలని.. లేకపోతే తట్టుకోవడం కష్టమనే భావన గంటాలో వచ్చేసిందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news