కరోనా నేపథ్యంలో ఏప్రిల్‌లో జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇటీవలే ముగిసింది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు కూడా మళ్లీ ప్రారంభమవుతున్నాయి. ఇక శ్రీలంక క్రికెట్ బోర్డు గురువారం నుంచి లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) 2020ని నిర్వహించనుంది. కరోనా నేపథ్యంలో ఈ టోర్నీ కూడా 8 నెలలు ఆలస్యంగా జరుగుతోంది.
ఎల్పీఎల్ గురువారం నుంచి ప్రారంభం కానుండగా ఇందులో మొత్తం 5 టీంలు తలపడనున్నాయి. అయితే ఐపీఎల్లో క్వాలిఫైర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లు ఉన్నట్లుగా ఇందులో మ్యాచ్‌లు లేవు. సంప్రదాయ సెమీ ఫైనల్ మ్యాచ్‌లను రెండింటిని నిర్వహిస్తారు. అందులో గెలుపొందిన వారికి ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఇక ఎల్పీఎల్ ఫైనల్ డిసెంబర్ 16న జరుగుతుంది. మ్యాచ్‌లన్నింటినీ శ్రీలంకలోని హంబన్‌టొటలో ఉన్న మహీంద్రా రాజపక్సె స్టేడియంలో నిర్వహిస్తారు. భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌లు రోజూ రాత్రి 7.30 లేదా 8.00 గంటలకు ప్రారంభమవుతాయి. రెండు మ్యాచ్‌లు ఉంటే మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు జరుగుతుంది.
ఎల్‌పీఎల్‌ను ప్రేక్షకులు సోనీ సిక్స్ టీవీలో వీక్షించవచ్చు. సోనీ లీవ్, ఎయిర్ టెల్ ఎక్స్‌స్ట్రీం, జియో టీవీ యాప్‌లలోనూ ఈ మ్యాచ్‌లను చూడవచ్చు. కాగా భారత్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ పొందిన పలువురు మాజీ క్రికెటర్లు ఈ లీగ్‌లో ఆడనున్నారు. జఫ్నా స్టాలియన్స్, దంబుల్లా వైకింగ్, గాలె గ్లాడియేటర్స్, కొలంబో కింగ్స్, కాండీ టస్కర్స్ టీంలు ఎల్పీఎల్లో తలపడనున్నాయి.