స్పీకర్‌ తమ్మినేని ముందు మంత్రులు తేలిపోతున్నారా?

-

ఏపీ సభాపతి తమ్మినేని సీతారాం ఏం మాట్లాడినా సంచలనమే. స్పీకర్‌ పదవిలో ఉండి కూడా ప్రభుత్వాధినేతను పొగడాలన్నా.. విపక్షాలపై విరుచుకుపడాలన్నా అది ఆయనకే సాధ్యమని వైసీపీ నేతలు చెబుతారు. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో 8చోట్ల వైసీపీ గెలిచింది. తమ్మినేని స్పీకర్‌ కాగా.. ధర్మాన కృష్ణదాస్‌ ఉప ముఖ్యమంత్రిగా.. సీదిరి అప్పలరాజు మంత్రిగా ఉన్నారు. వీరు కూడా విపక్షాలపై విమర్శలు చేస్తున్నా.. అవి తమ్మినేని చేసే కామెంట్స్‌ ముందు తేలిపోతున్నాయట.

శ్రీకాకుళం జిల్లా ఇంఛార్జ్‌ మంత్రిగా కొడాలి నాని ఉన్నారు. అయినప్పటికీ తమ్మినేని వాయిస్‌ ఒక్కటే బలంగా వినిపిస్తున్నట్టు అధికార పార్టీ నేతలు కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ విషయంలో తనపై ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోవడం లేదు స్పీకర్‌. ఇక నిన్నటి అసెంబ్లీ సమావేశాల్లోను చంద్రబాబుతో ఢీ అంటే ఢీ అన్నారు.మాట్లాడే పద్ధతి నేర్చుకోవాలంటూ చంద్రబాబుపై తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఉడత ఊపులకు, పిల్లి శాపనార్థాలకు భయపబోనని కామెంట్ చేశారు.. సభాధ్యక్షుడునే బెదిరిస్తారా అంటూ స్పీకర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

ఆ మధ్య ఇళ్ల పట్టాలు వాయిదా పడిన నాటి నుంచి ఏ మాత్రం అవకాశం చిక్కినా చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. ఆమదాలవలసలో నిత్యం పర్యటించే తమ్మినేని ప్రభుత్వ పథకాలను ప్రమోట్‌ చేస్తూ ప్రభుత్వాధినేతపై ఓ రేంజ్‌లో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. స్పీకర్‌ పదవిలో ఉండి కూడా తమ్మినేని ఈ స్థాయిలో ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటే.. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, సీనియర్‌ ఎమ్మెల్యేలకు ఏమైందని అప్పుడప్పుడూ ప్రశ్నిస్తున్నాయట పార్టీ శ్రేణులు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నా.. గడిచిన ఏడాదిన్నరగా పెద్దగా నోరు విప్పింది లేదు. మంత్రులు కృష్ణదాస్‌, అప్పలరాజులు సౌమ్యంగా ఉంటున్నారనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

ప్రభుత్వానికి సంబంధించిన విషయమైనా.. విపక్షాలపై విరుచుకుపడే అంశమైనా తనదైన శైలిలో పూర్తి స్థాయిలో విరుచుకుపడటం పార్టీ శ్రేణులను కూడా ఉత్సాహ పరుస్తోందట. సిక్కోలు వాయిస్‌ వినిపించాలంటే అది స్పీకర్‌ తమ్మినేనికే సాధ్యమని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు పార్టీ కార్యకర్తలు. మరి.. జిల్లాలోని మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు ఈ విషయంలో తమ్మినేని బీటౌట్‌ చేస్తారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news