సొంత జిల్లాకు ఆ మంత్రిగారు ఇంఛార్జ్ వస్తానంటే వద్దంటే వద్దంటున్నారు స్థానిక ఎమ్మెల్యేలు. . పాతికేళ్లకుపైగా ప్రజాప్రతినిధిగా ఉన్న ఆయనకు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు మధ్య ఉన్న గొడవేంటి..మంత్రిగారి దూకుడు మాటతీరే ఆయనకు శాపంగా మారిందా..కార్పోరేషన్ ఎన్నికల ముంగిట ఓరుగల్లు అధికార పార్టీలో నడుస్తున్న పవర్ గేమ్ ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతుంది.
ఆరుసార్లు ఎమ్మెల్యే అంటే దాదాపు పాతికేళ్లకుపైగా ప్రజాప్రతినిధిగా అనుభవం ఎర్రబెల్లి దయాకర్‌రావు సొంతం. 1982లో ఎన్టీఆర్ నేతృత్వంలో వచ్చిన తెలుగుదేశం పార్టీలో చేరి డీసీసీబీ చైర్మన్‌గా రాజకీయ జీవితం మొదలుపెట్టారు. అక్కడి నుంచి టీడీపీ శాసనసభాపక్ష నాయకుని స్థాయికి ఎదిగారు. 1994, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. మధ్యలో 2008 వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఎంపీగా ఉన్నారు. టీడీపీలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఎర్రబెల్లికి అవకాశం రాలేదు. 2016లో టీఆర్ఎస్లో చేరిన ఎర్రబెల్లి.. ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి కేసియార్ కేబినెట్లో మంత్రయ్యారు. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి నాలుగైదుసార్లు ఎమ్మెల్యేలుగా ఉన్న వారిని సైతం పక్కకుపెట్టి కేబినెట్లో ఎర్రబెల్లికి వరంగల్ జిల్లా నుంచి ప్రాధాన్యం ఇచ్చారు కేసియార్.
ఎర్రబెల్లికి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏడాదిన్నర గడిచిపోయింది. ఉద్యమం నుంచి టీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలకు.. మంత్రికి మధ్య ఇప్పుడు అగాధం ఏర్పడింది. త్వరలోనే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. స్థానికంగా ఉన్న మంత్రి ఎర్రబెల్లినే ఇంఛార్జ్‌గా పెడతారని అందరి అంచనా. అయితే స్థానిక ఎమ్మెల్యేలకు మాత్రం ఇది ఏమాత్రం ఇష్టంలేదు. ఆయన్ని ఇంఛార్జ్‌గా వద్దంటూ ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి మొరపెట్టుకున్నారు. ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్, మరో ఎమ్మెల్యే కలిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారట. ఏమైనా చేయండి కానీ… ఆయన్ను మాత్రం ఎన్నికల ఇంఛార్జ్‌గా తప్పించండి.. ఇంకెవరిని పంపినా మాకు అభ్యంతరం లేదని వేడుకున్నారట.
ఎమ్మెల్యేలతో ఏమాత్రం పొసగడం లేదన్న విషయం గమనించిన మంత్రి కూడా.. కాస్త చల్లబడినట్లు సమాచారం. వాళ్లు వద్దంటే నేను కాదంటానా అని వ్యాఖ్యానిస్తున్నారట. హైకమాండ్ చెప్పినట్టే నడుచుకుంటానని సన్నిహితుల దగ్గర చెబుతున్నారట మంత్రి. ఎమ్మెల్యేల నియోజకవర్గంలో ఎర్రబెల్లి దూకుడుగా వ్యవహరించడంతో పరిస్థితి ఇంతదాకా వచ్చిందని సమాచారం. మొదటి నుంచి పార్టీకి అండగా నిలబడిన ఎమ్మెల్యేల ఫిర్యాదుతో.. ఇంఛార్జ్ విషయంలో అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. కొత్త వారికి బాధ్యతలు ఇస్తారా లేక ఆయనతోనే ఎమ్మెల్యేలకు సయోధ్య కుదుర్చుతారా అన్నది చూడాలి.