తిరుపతి ఉపఎన్నిక షెడ్యూల్ రాకుండానే తిరుపతి కేంద్రంగా హడావిడి మొదలుపెట్టేసింది బీజేపీ. మీటింగ్‌లు.. శిక్షణ తరగతులు.. నేతల పర్యటనలు ఒకటేమిటి పార్టీ పరంగా చేయడానికి అవకాశం ఉన్న పనులన్నీ చేసేశారు బీజేపీ నాయకులు. షెడ్యూల్ కూడా రాకుండానే తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక పై దూకుడు ప్రదర్శించిన బీజేపీ.. ఇప్పుడు సడన్ గా ఎందుకు స్లో అయింది.
ఆ మధ్య రాష్ట్రస్థాయి బీజేపీ సమావేశంలోనూ తిరుపతి ఉపఎన్నికపై లోతైన చర్చే చేశారు పార్టీ నాయకులు. లేడికి లేచిందే పరుగన్నట్టు తిరుపతిలో సన్నాహక సమావేశాలు పెట్టేశారు. తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రం కావడంతో.. ఆ సెంటిమెంట్ కూడా పార్టీకి కలిసి వస్తుందని లెక్కలు వేసుకున్నారు. బీజేపీ వేగం చూసిన పలువురు ఎస్సీ నాయకులు పార్టీ టికెట్ కోసం లాబీయింగ్ మొదలుపెట్టేశారు. ఇంతలో తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నికలో గెలవడం.. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ పుంజుకోవడంతో ఆ ఎఫెక్ట్ తిరుపతి లోక్‌సభ బై ఎలక్షన్‌పై ఉంటుందని భావించారు.
తిరుపతి వైసీపీ లోక్‌సభ సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ అకాల మరణంతో జరగబోయే ఉపఎన్నికపై ఎన్నో ఆశలు పెట్టుకుంది ఏపీ బీజేపీ. ఆ ఆశలను సాకారం చేసుకునే దిశగా హడావిడి చేసిన కమల దళంలో ఇప్పుడు అలికిడి లేదు. ఉలుకు లేదు. పలుకు లేదు. నిన్న మొన్నటి వరకు చెమటలు కారేలా తిరిగిన నాయకులంతా రిలాక్స్ మూడ్‌లో కనిపిస్తున్నారని బీజేపీలోనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అభ్యర్థి ఎంపిక పై కసరత్తును కూడా పక్కన పెట్టేసి సడన్ గా సైలెంట్ అవ్వడానికి కారణం జనసేన పెట్టిన కండీషన్స్ అని తెలుస్తుంది.
ఏపీ బీజేపీ నేతలు ఏవేవో లెక్కలు వేసుకుని ఎన్నికల రణానికి సిద్ధమవుతున్న తరుణంలో వారి స్పీడ్‌కు జనసేన బ్రేక్‌లు వేసిందనే చర్చ జరుగుతోంది. బీజేపీ తిరుపతిలో పోటీ చేస్తుంది.. జనసేనాని పవన్ కల్యాణ్ మద్దతిస్తారు అన్న అభిప్రాయంలో ఉన్న నాయకులకు కొత్త ప్రతిపాదనలు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాయని సమాచారం. తిరుపతిలో జనసేన నుంచి అభ్యర్ధిని పోటీలో పెట్టాలని పవన్ ఆలోచించడమే దీనికి కారణమట. ఈ విషయంలో జనసేనాని పట్టుదలగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో బీజేపీ నాయకులు స్లో అయ్యారని అనుకుంటున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో జనసేన బీజేపీకి మద్దతివ్వడం.. తర్వాత ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్ బీజేపీ జాతీయ నాయకులతో మాట్లాడిన తర్వాత చేసిన ప్రకటనతో మొత్తం సీన్ మారిపోయిందట. మొన్నటి వరకు బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటారని ఆరున్నొక్క రాగంలో చెప్పిన కమలనాథులు ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థి అనే పదాన్ని పదేపదే సంత చెప్పినట్టు వంత పాడుతున్నారు. ఈ అంశంపై బీజేపీలోనూ గట్టి చర్చే జరుగుతోందని సమాచారం. రైతులను పరామర్శించే ఉద్దేశంతో తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో పవన్ కల్యాణ్ సుడిగాలి పర్యటన చేశారు.
తిరుపతి ఉపఎన్నిక గురించి బీజేపీ జాతీయ నాయకత్వం ఎటూ తేల్చకపోవడం.. ఇటు పవన్ కల్యాణ్ సైతం జనసేన అభ్యర్థిని బరిలో దించాలని పట్టుదలగా ఉండటంతో ఒకింత ప్రతిష్ఠంభన నెలకొందనేది కమలనాథులు చెప్పేమాట. కొందరు బీజేపీ నాయకులకు ఈ పరిణామాలు రుచించడం లేదని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి డిపాజిట్ దక్కలేదు. ఇప్పుడు జరగబోయే ఉపఎన్నికలో గెలుపోటములు పక్కన పెడితే ఏపీలో పార్టీ బలోపేతానికి మంచి అవకాశంగా భావిస్తూ వస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.
తిరుపతి లోక్‌సభ పరిధిలోకి వచ్చే 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జ్‌లతో ఇప్పటికే మీటింగ్ పెట్టారు ఏపీ బీజేపీ చీఫ్. అభ్యర్థుల వడపోత చేపట్టారు. కానీ.. పవన్ కల్యాణ్ ఎంట్రీతో షాక్ తగలడంతో బీజేపీ నాయకులు వేడి చల్లారిపోయిందని అనుకుంటున్నారు. ఇదే సమయంలో మరో చర్చ కూడా జరుగుతోంది. ఏపీలో మిత్రపక్షంగా ఉన్న జనసేనను సంప్రదించకుండా తిరుపతిలో బీజేపీ తొందరపడిందనే అభిప్రాయంలో పవన్ పార్టీ నేతలు ఉన్నారట. మిత్రపక్షంగా ఉన్నప్పుడు ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. అందుకే జనసేనాని పట్టుదలగా ఉన్నట్టు చెబుతున్నారు.
మరి.. బీజేపీ జాతీయ నాయకత్వం ఉమ్మడి అభ్యర్థి ప్రకటనకే కట్టుబడి ఉంటుందో లేక గ్రేటర్ ఎన్నికల మాదిరి తమ అభ్యర్థిని ప్రకటించేసి మద్దతివ్వాలని జనసేనను కోరుతుందో చూడాలి.