ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం నాలుగు గంటలకు జగన్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రేపు రాత్రి 9 గంటలకు ఆయన అమిత్ షాతో భేటీ కానున్నట్లు సమాచారం అందుతోంది. ప్రధాని మోడీని కూడా సీఎం జగన్ కలిసే అవకాశం ఉన్నట్లు ఢిల్లీ మీడియా వర్గాల సమాచారం. ముందుగా అమిత్ షాతో భేటీ కానున్న జగన్ ఏపీకి సంబంధించిన పలు అంశాల మీద ఆయనతో చర్చలు జరపనున్నారు. నిజానికి సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఈ రోజే జగన్ పోలవరాన్ని సందర్శించారు. ప్రాజెక్టు వద్దనే అధికారులతో సమీక్ష జరిపిన జగన్ పోలవరం పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
అయితే ఈ నేపథ్యంలోనే పోలవరం నిధులు గురించి ఆయన ఢిల్లీ పర్యటన ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఆసక్తి కరంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నిన్ననే తన ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన ఈ పర్యటనలో ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహా కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అలాగే మరికొందరు కేంద్ర మంత్రులను కలిసి వచ్చారు. ఆయన అలా పర్యటన ముగించుకుని వచ్చారో లేదో ఇప్పుడు జగన్ బయలుదేరి వెళ్లడం ఆసక్తికరంగా మారింది.