ఏపీ సర్కార్-ఎస్ఈసీ వార్..రేపు హైకోర్టులో కీలక విచారణ

-

ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం- రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య వార్ కొనసాగుతోంది. ప్రజలకు వ్యాక్సిన్ వేసేందుకు వీలుగా ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌పై SEC కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు రేపు కీలక విచారణ జరపనుంది.

ఏపీలో పంచాయితీ ఎన్నికల పంచాయతీ హైకోర్టుకి చేరింది. ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఇప్పుడే అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం… రెండు వర్గాలు ఎవరి వాదన వాళ్లు వినిపిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్, వ్యాక్సినేషన్ వంటి వాటిని కారణాలుగా చూపి.. ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేయాలని అంటోంది. గతంలో రాష్ట్రంలో పది వేల కేసులు వచ్చాయని.. ఇప్పుడవి 3వేల లోపే ఉన్నాయంటోంది ఏపీ ఎస్‌ఈసీ.

వ్యాక్సిన్‌ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని… రాష్ట్ర ఎన్నికల సంఘం తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఎన్నికల వల్ల వ్యాక్సినేషన్‌కు విఘాతం కలగదని… వ్యాక్సిన్‌లు పరిమిత సంఖ్యలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వేయాలన్న జాతీయ విధానాన్ని అఫిడవిట్‌లో ప్రస్తావించింది ఎన్నికల సంఘం. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని, అర్టికల్ 14 ప్రకారం రాజ్యాంగ బద్ధ సంస్థకు ఉన్న హక్కులను ఉల్లంఘిస్తోందనేది ఎస్ఈసీ ఆరోపణ.

ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ జోక్యం చేసుకోరాదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని, స్థానిక ఎన్నికలపై కేరళ ప్రభుత్వం స్టే కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఆర్డర్లు ఇవ్వలేదన్న ఎస్ఈసీ పేర్కొంది. ఎన్నికల ప్రక్రియపై ప్రభుత్వంతొ సంప్రదింపులు జరిపిన తర్వాతే నోటిఫికేషన్ ఇచ్చామన్న ఎస్ఈసీ తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా తగ్గముఖం పట్టడంతో దేశ ఎన్నికల సంఘంలో పలు చోట్ల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. ఏపీలో కరోనా తగ్గముఖం పడటంతో ప్రభుత్వం స్కూల్స్, మాల్స్, ధియేటర్లు తెరవటానికి అనుమతి ఇచ్చిందని ఎస్‌ఈసీ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.

తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరిగాయని, కరోనా తగ్గముఖం నేపధ్యంలోనే బీహార్, రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం ఓకే చెప్పిందని వివరించింది. 416 పేజీల్లో పలు తీర్పు కాపీలను కూడా జతచేస్తూ హైకోర్టులో కౌంటర్ ఎఫిడవిట్‌ వేసింది ఏపీ ఎన్నికల సంఘం. మరి దీనిపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news