పలాసలో మంత్రిగారు రాజేసిన రచ్చ కొత్త మలుపు తిరుగుతుందా

-

సిక్కోలు జిల్లా పలాసలో భూ ఆక్రమణలు తొలగించాల్సి వస్తే గౌతు లచ్చన్న విగ్రహం నుంచే మొదలు పెట్టాల్సి వస్తుందని మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలపై పదిరోజులుగా పలాసలో ఓ రేంజ్‌లో రాజకీయ రచ్చ నడుస్తోంది. పలాసలో భూ కబ్జాలపై మొదలైన చర్చ.. విగ్రహంపైకి మళ్లి.. తీవ్ర దుమారాన్ని రేపింది. ఎవరికి వారు సై అంటే సై అనుకున్నారు. సీన్‌ కట్ చేస్తే.. వన్‌ ఫైన్‌ మార్నింగ్‌.. ఎలాంటి వివాదం లేదని ప్రకటించారు మంత్రి అప్పలరాజు.అసలు కంటే కొసరు ఎక్కువైందంటూ ఈ వివాదం కొత్త మలుపు తిరిగుతుంది.

జిల్లాలో ఆర్థిక రాజధానిగా పిలుచుకునే పలాసలో భూ ఆక్రమణలపై వైసీపీ, టీడీపీ మధ్య మొదలైన యుద్ధం మలుపులు మీద మలుపులు తీసుకుంటోంది. మంత్రి అప్పలరాజు కనుసన్నల్లోనే భూ కబ్జాలు జరుగుతున్నాయని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆరోపించడంతో సెగ రాజుకుంది. కొద్దిరోజులు మంత్రి వర్సెస్‌ ఎంపీ అన్నట్లు మాటల తూటాలు పేలాయి. ఆ సందర్భంగా గౌతు లచ్చన్న విగ్రహం ప్రస్తావన రావడంతో సమస్య మరింత ముదిరింది. ఈ వివాదంలోకి గౌతు లచ్చన్న వారసులు, శ్రీశయన, గౌడ సంఘాలు ఎంట్రీ ఇచ్చాయి.

మంత్రి కామెంట్స్‌కు నిరసనగా లచ్చన్న వారసుడు శివాజీ, మనవరాలు శిరీషలు తమ ఆత్మగౌరవం దెబ్బతిందని ఆందోళనకు దిగారు. మంత్రికి వ్యతిరేకంగా భారీ నిరసనకు పిలుపివ్వడంతో 24 గంటలపాటు పలాస అట్టుడికింది. ఛలో పలాసకు వెళ్లకుండా ఎక్కడికక్కడ టీడీపీ నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఇదే సమయంలో తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఎదురుదాడికి దిగారు మంత్రి అప్పలరాజు. లచ్చన్న విగ్రహానికి కులాన్ని ఆపాదిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

పలాస కేంద్రంగా రాజకీయం రసవత్తరంగా సాగుతున్న వేళ కొందరు శ్రీశయన, గౌడ సంఘాల ప్రతినిధులు మంత్రిని కలిశారన్న సమాచారం కొత్త చర్చకు దారితీసింది. రాజకీయాల్లోకి తమను లాగొద్దని.. గౌతు లచ్చన్న విగ్రహం ప్రతిష్టకు భంగం కలిగించొద్దని మంత్రికి విజ్ఞప్తి చేశారట ఆ సంఘాల ప్రతినిధులు. దానికంటే ముందు వివాదాస్పదంగా మారిన గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటు చేసిన స్థలాన్ని పరిశీలించడం చకచకా సాగిపోయింది. ఆ తర్వాత లచ్చన్న విగ్రహంపై ఎలాంటి రాజకీయాలు మాట్లాడదలచుకోలేదని.. విమర్శలు చేయబోనని.. సదరు స్థలాన్ని క్రమబద్దీకరిస్తామని ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పారు మంత్రి అప్పలరాజు.

మంత్రి ప్రకటన వరకు బాగానే ఉన్నా.. అసలు రచ్చ మళ్లీ మొదటికొచ్చిందట. లచ్చన్న వారసులకు తెలియకుండా కొత్త సంఘాలు ఎక్కడ నుంచి వచ్చాయని శివాజీ, శిరీషలు మండిపడుతున్నారట. అప్పలరాజు క్షమాపణ చెప్పాల్సిందేనని.. ఇందుకోసం ఎక్కడికైనా వెళ్తామని హెచ్చరిస్తున్నారట. అంతేకాదు ఈ సమస్యపై ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారట. ఎవరో ఒకరిద్దరిని వెంటేసుకుని లచ్చన్న విగ్రహంపై వివాదం ముగిసిందని అంటే ఎట్లా అని ప్రశ్నిస్తున్నారట శివాజీ, శిరీష. ప్రస్తుతం ఈ అంశంపైనే పలాసలో జోరుగా చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news