జగన్ ఇలాఖాలో మూడేళ్ల నాటి కేసు..అరెస్టుల ఆంతర్యం ఇదేనా

-

దాదాపు మూడేళ్ల నాటి కేసు అది.. రెండు రాజకీయ పార్టీల మధ్య రగడ.. రాళ్ల దాడి వరకు వెళ్లింది. అప్పట్లో కడప జిల్లాలోని జగన్‌ ఇలాఖాలో తీవ్ర అలజడి రేపింది. ఆ కేసులో తాజాగా టీడీపీ నేతల అరెస్టుల పర్వం సాగింది. 2018లో కడప జిల్లా పులివెందుల పూల మార్కెట్‌ వద్ద జరిగిన రాళ్ల దాడి కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్ట్ అయ్యారు. చెన్నై ఎయిర్ పోర్టులో తమిళనాడు పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. రవి తప్పించుకునేందుకు ప్రయత్నించగా అదుపులోకి తీసుకున్నారు.

రాళ్లదాడి, హత్యాయత్నం కేసులో వారెంట్ పెండింగ్ ఉన్నప్పటికీ రవి అరెస్టు కాకపోవడం.. కనీసం బెయిల్ కూడా తీసుకోకపోవడంతో ఇవాళ ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. 2018లో పులివెందుల అభివృద్ధిపై చర్చకైనా, రచ్చకైనా సిద్ధమని ప్రకటించిన టీడీపీ నేతలు… రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడినట్టు కేసు నమోదు అయింది. 2018 ఫిబ్రవరి 28న కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి టీడీపీ మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి మధ్య సవాళ్ల పర్యం నడించింది. అందుకు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి స్పందించి చర్చకు తాను సిద్దమని, ఎప్పుడు, ఎక్కడికి పిలిచినా వస్తానంటూ 2018 మార్చి 1న ప్రతి సవాల్‌ విసిరారు. పులివెందులలోని పూల మార్కెట్‌ సర్కిల్‌లో సాయంత్రం 4 గంటలకు చర్చకు రావాలని సతీష్‌రెడ్డి సవాల్ విసిరారు.

సవాళ్లతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కేసరికి… భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా… కార్యకర్తలు అడ్డుకోవడంతో సాధ్యపడలేదు. అటు చర్చకు బయల్దేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డిని గృహనిర్బంధంలో ఉంచారు. ఇదే సమయంలో బీటెక్‌ రవి, రాంగోపాల్‌రెడ్డి తమ పార్టీ కార్యకర్తలతో కలిసి పూల మార్కెట్‌ సర్కిల్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాళ్ల దాడి జరిగింది. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.

పక్కా ప్లాన్‌తో టీడీపీ దాడి చేసిందని అప్పట్లో వైసీపీ ఆరోపించింది. ఈ కేసులో మొత్తం 253 మంది పై పోలీసులు కేసులు పెట్టారు. బీటెక్ రవితో పాటు మరో 63 మందిపై 307 సెక్షన్‌ కింద కేసు పెట్టారు. అయితే అందులో పెండింగ్‌లో ఉన్న వారెంట్‌కు సంబంధించి ఇప్పటివరకు బెయిల్‌ తీసుకోకపోవడంతో రవిని అరెస్టు చేసి ఏపీ పోలీసులకు అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Latest news