ఎమ్మెల్సీ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ఠాగూర్ ఓ కమిటీని నియమించారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపైనా పార్టీ నాయకులతో చర్చలు జరిపారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఎన్నికల కమిటీల పై మాత్రం కొందరు నాయకులు పెదవి విరుస్తున్నారు..ఇక సమీక్షల కంటే గ్రౌండ్ లెవల్ పర్యటనలు బెటర్ అని సమావేశంలో తేల్చారట టీ కాంగ్రెస్ నేతలు.
ఎమ్మెల్సీ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ దృష్టి సారించింది. రెండురోజుల పాటు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్ సమీక్ష చేశారు. అభ్యర్థుల ఎంపికపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి నేతృత్వంలో కమిటీ వేశారు. అందరితో సంప్రదింపులు జరిపి.. అభ్యర్ది పేరును ఖరారు చేయాలని సూచించారు. జీవన్ రెడ్డి కమిటీ సూచించిన పేరునే సోనియాగాంధీ ఆమోదం కోసం పంపిస్తామని చెప్పారు. అయితే ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ సీటుపై పీట ముడి పడింది. ఈ బాధ్యతను స్థానిక నాయకులకే అప్పగించారు ఠాగూర్. నాగార్జునసాగర్ ఉపఎన్నికపై సమీక్ష చేయాలని అనుకున్నా… దీన్ని వాయిదా వేశారు ఠాగూర్.
నల్గొండ..ఖమ్మం..వరంగల్ ఎమ్మెల్సీ నియోజకవర్గ సమావేశం హాట్ హాట్‌గా సాగింది. కోదండరాం, చెరుకు సుధాకర్లకు మద్దతు ఇవ్వొద్దని నాయకులు చెప్పారు. పార్టీలో ఉన్న వ్యక్తులకే టికెట్ ఇవ్వాలని.. బయటికి ఇవ్వొద్దని సీనియర్లు చెప్పారు. అయితే ఇప్పటికే టికెట్లు ఖరారైపోయిందని ప్రచారం జరుగుతుంటే ఈ కమిటీలు ఎందుకని ప్రశ్నించారు మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి. అయితే కమిటీ సూచించిన పేరునే హైకమాండ్ ఆమోదిస్తుందని స్పష్టం చేశారు ఠాగూర్.
సమీక్షలు,సమావేశాల కంటే గ్రౌండ్ లెవల్ ఎన్నికలున్న ప్రాంతాల్లో పర్యటించి స్థానిక కేడర్ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటే ఫలితం ఉంటుందని ఇంచార్జ్ కి సూచించారట కొందరు టీ కాంగ్రెస్ నేతలు. పీసీసీ చీఫ్ ఎంపికలో వచ్చిన అభిప్రాయ భేదాలతో ఈ సమావేశాలకు కొందరు నేతలు మొఖం చాటేశారు. మరికొందరు పాల్గొన్న తమ అభిప్రాయం చెప్పకుండా గుంభనంగా వ్యవహరించారు.
ఖమ్మం.. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై కూడా సమీక్ష జరిగింది. వెంటనే బూత్ కమిటీలను వేయాలని ఠాగూర్ నేతలకు సూచించారు. ఫిబ్రవరి మొదటి వారంలో వరంగల్, ఖమ్మంలో పర్యటిస్తానని ఆయన స్పష్టం చేశారు. అయితే మేయర్ అభ్యర్థిని ముందే ప్రకటించాలని వరంగల్ జిల్లా నాయకులు కోరగా.. పార్టీ నిబంధనలు మేరకే నిర్ణయం ఉంటుందన్నారు ఠాగూర్.