దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని చోట్ల మాత్రం వ్యాక్సిన్ తీసుకున్న వారికి రియాక్షన్స్ వస్తున్నాయి. అయితే ఎక్కువగా అలా రియాక్షన్ వస్తున్న వారికి చిన్న చిన్న అలర్జీలతోనే తగ్గిపోతుండగా కొంత మందికి మాత్రం ప్రాణాల మీదకు వస్తోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో కలిపి వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం వివిధ కారణాలతో మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరింది.
తాజాగా కరోనా వ్యాక్సిన్ వికటించి ఒంగోలు రిమ్స్ వైద్యురాలు ధనలక్ష్మికి తీవ్ర అస్వస్థత ఏర్పడింది. ఈనెల 23న రిమ్స్ లో డాక్టర్ ధనలక్ష్మి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. సరిగ్గా తీసుకున్న రెండ్రోజుల తర్వాత నుండి అంటే 25 నుండి తీవ్ర జ్వరంతో ఆమె బాధపడుతున్నారు. రిమ్స్ లో చికిత్స అనంతరం రిమ్స్ అధికారులు ప్రవేటు హాస్పటల్ లో చేర్చారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నై తరలించారు. ఆమె ఆరోగ్యానికి సంబంధించి బంధువులు టెన్షన్ పడుతున్నారు.