హైదరాబాద్ లో అగ్రిగోల్డ్ డైరెక్టర్ అవ్వా ఉదయ్ భాస్కర్ రావు మృతి చెందారు. అగ్రిగోల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ భాస్కర్ రావు మృతి చెందడం సంచలనంగా మారింది. అగ్రిగోల్డ్ కేసులో ఎనిమిది రాష్ట్రాలకు చెందిన 32 లక్షల మంది బాధితులు ఉన్నారు. ఆరు వేల కోట్లు డిపాజిట్ రూపంలో చెల్లించి బాదితులు మోసపోయారు.
అగ్నిగోల్డ్ స్కామ్ కేసులో గతంలో ఆయన సోదరుడు చైర్మన్ అవ్వా వెంకట రామారావు తో సహా డైరెక్టర్ గా ఉన్న ఉదయ్ భాస్కర్ తదితరులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. కొద్ది నెలలు జైల్లో ఉన్న అనంతరం వీరు బెయిల్ పై బయటకు వచ్చారు. ఏపీ, తెలంగాణలో అగ్రిగోల్డ్ సంస్థ పై వందల సంఖ్యలో కేసులు నడుస్తున్నాయి. లక్షలాది మంది ఖాతాదారులకు న్యాయం చేసేందుకు గాను ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.