తిరుపతి ఉప ఎన్నికల వేళ పవన్,ఎన్టీఆర్ ల వైపు పార్టీల చూపు

-

ఏపీలో ఓట్లు, సీట్ల కోసం పార్టీలు వ్యూహం మార్చాయి. తిరుపతి ఉప ఎన్నికల వేళ పొలిటికల్‌ పార్టీలు స్టార్‌ హీరోల వెంట పడుతున్నాయ్‌. మాతో కలవాలి..మా పార్టీలోకి రావాలంటూ కోరుతున్నాయి. తిరుపతి ఉప ఎన్నికకు ముందు బీజేపీ అనూహ్యంగా పవన్‌ జపం చేస్తుండగా టీడీపీలోనూ జూనియర్‌ ఎన్టీఆర్‌ రీ ఎంట్రీపై నాయకులు పెదవి విప్పుతున్నారు. దీంతో పవన్,ఎన్టీఆర్ ల పై ఆసక్తికర చర్చ నడుస్తుంది.

వచ్చే ఎన్నికల కంటే ముందే గ్రౌండ్‌లో సత్తా చాటేందుకు రూటు మార్చాయి ప్రధాన పార్టీలు. పార్టీకి స్టార్‌ పవర్‌ తోడైతే అదరగొట్టొచ్చని భావిస్తున్నారు. అందుకే అటు టీడీపీ, ఇటు బీజేపీలు స్టార్‌ హీరోల జపం చేస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నికకు ముందు ఏపీలో ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. తిరుపతి ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కమలం ప్రభంజనం తిరుపతి నుంచే ప్రారంభమవుతుందని ప్రకటనలు చేస్తున్నారు. తిరుపతి బరిలోకి రత్నప్రభను దించిన బీజేపీ.. పవన్‌ సాయంతో గెలవాలని భావిస్తోంది. అందుకే జనసేనానితో వీలైనంత ఎక్కువగా ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమైంది.

పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో వరుస ఓటములతో టీడీపీ పార్టీ కుదేలైంది. దీంతో ఆ పార్టీలోని కొందరు నేతలు కొత్త రక్తం రావాలంటున్నారు. యువ నాయకత్వం వస్తుందని చెబుతున్నారు. కొందరు నేతలు బహాటంగానే జూనియర్‌ ఎన్టీఆర్‌ రాజకీయాల్లో యాక్టివ్‌ కావాలని కోరుతున్నారు. ఆయన అభిమానులు నుంచి గత కొద్ది కాలంగా ఇదే డిమాండ్‌ వినిపిస్తోంది. ఈ సమయంలో టీడీపీ సీనియర్‌ నేత బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. జూనియర్‌ మళ్లీ వస్తారంటూ చెప్పడం తమ్ముళ్లలో జోష్‌ నింపింది.

పార్టీలు కోరుతున్నా ఈ స్టార్ హీరోల మనసులో ఏముందన్న చర్చ నడుస్తుంది. పాలిటిక్స్‌ చేస్తూనే సినిమాలు కానిస్తున్న పవన్‌ కల్యాణ్‌ మొదట్నుంచి బీజేపీతో కలిసి నడుస్తున్నారు. ఆ మధ్య తెలంగాణ బీజేపీపై నిప్పులు చెరిగిన పవన్‌ కల్యాణ్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణిదేవికి మద్దతు తెలిపారు. దీంతో పవన్‌తో ఉన్న గ్యాప్‌ను తగ్గించేసుకుని ముందుకు సాగాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అందుకే పవన్‌ జపం అందుకున్నారు.

ఇక జూనియర్‌ ఎన్టీఆర్‌ మాత్రం పాలిటిక్స్‌ గురించి అడిగితే ఇప్పుడు కాదు అని దాటేస్తున్నారు. ఇది సమయం.. సందర్భం కాదంటున్నారు. మొత్తంగా రాజకీయాలపై ప్రశ్నలు, చర్చపై పెద్దగా స్పందించడం లేదు. కానీ ఎన్టీఆర్‌ టీడీపీలో యాక్టివ్‌ అయితే పార్టీలో మునుపటి జోష్‌ వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news