తెలంగాణలో మళ్లీ మొదలైన ఎన్నికల సందడి..నోటిఫికేషన్ జారీ

-

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మినీ పురపోరుకు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో వివిధ కారణాల నేపథ్యంలో నిలిచిపోయిన ఖాళీ అయిన స్థానాల్లో పోలింగ్ నిర్వహించేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్​ షెడ్యూల్​ విడుదల చేసింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 66 డివిజన్లు ఉండగా, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఉన్నాయి.


రాష్ర్టంలో గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈసారి ప్రచారానికి ఆరు రోజుల సమయం విధించారు. ఈ నెల 22న అభ్యర్థుల తుది జాబితా తర్వాత ప్రచారం ఉంటోంది. ఎన్నికల నిబంధనల ప్రకారం 28న సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించారు. రేపటి నుంచి నామినేషన్ల పర్వం మొదలుకానుంది. అదే రోజున రిటర్నింగ్​ అధికారులు తుది ఓటరు జాబితాను విడుదల చేస్తారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 66 డివిజన్లు ఉండగా, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఉన్నాయి.

ఈ నెల 18న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజు. 19న నామినేషన్ల పరిశీలన ఉండగా 20న తిరస్కరించిన నామినేషన్లపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. 21న నామినేషన్లపై అభ్యంతరాలను పరిష్కరిస్తారు. ఉపసంహరణకు ఈ నెల 22న అవకాశం కల్పించారు. అదే రోజున సాయంత్రం 3 గంటల తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను, గుర్తులను విడుదల చేస్తారు. ఈ నెల 30న ఆయా మున్సిపాలిటీలు,కార్పోరేషన్లలో పోలింగ్​ నిర్వహించనున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్​ ఉంటుంది.

అనివార్య కారణాలతో రీపోలింగ్​ ఉంటే వచ్చేనెల 2న నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను మే 3న నిర్వహిస్తున్నట్లు ఎస్​ఈసీ ప్రకటించింది. ఏడు పురపాలికల్లో మొత్తం 11,26,221 మంది ఓటర్లు ఉండగా 5,53,862 మంది పురుషులు, 5,72,121 మంది మహిళలు, 236 మంది ఇతరులున్నారు. మొత్తం 248 వార్డులను విభజించారు. 1532 పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news