ఈటల రాజేందర్ వ్యవహారం రోజురోజుకూ మరింత ముదురుతోంది. ఇప్పటికే అచ్చంపేట భూ కబ్జా కేసులతో పాటు.. దేవరయంజాల్ భూములపై విచారణ జరిపిస్తోంది ప్రభుత్వం. అచ్చంపేటలో 66 ఎకరాలు కబ్జా చేశారని విచారణ కమిటీ తేల్చగా.. ఇక దేవరయంజాల్ లో దాదాపు 30ఎకరాల వరకు ఆక్రమించి గోదాములు కట్టారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అయితే అచ్చంపేట భూములపై ఈటల కంపెనీ జమున హ్యాచరీస్ కోర్టుకు వెళ్లగా కమిటీ ఇచ్చిన నివేదిక చెల్లదంటూ కోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసు కోర్టులో ఉండగానే ఇప్పుడు మరో కేసు ఈటలకు ఇప్పుడు మరోషాక్ తగిలింది.
అచ్చంపేట వద్ద నిర్మించిన జమున హ్యాచరీస్‌కు రోడ్డు వేసినప్పుడు అటవీ చెట్లను అనుమతి లేకుండా కొట్టేశారని గతంలోనే కమిటీ చెప్పింది. అయితే ఇప్పుడు అటవీశాఖ ఈ వ్యవహారంపై జమున హ్యాచరీస్‌కు నోటీసులు జారీ చేసింది. 237 చెట్లను అనధికారికంగా నరికేశారంటూ అందులో పేర్కొంది. వీటి నరికివేతపై మూడు రోజుల్లో సరైన సమాధానం చెప్పకపోతే చట్టపరంగా కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించింది. అయితే రోడ్డు వేసేందుకు ప్రభుత్వ భూమిని వాడుకోలేదని అందులో పేర్కొంది. మరి చెట్లు కొట్టివేతపై అటవీశాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.