పైన ఫోటో చూడగానే నోరూరుతోందా? అల్లం గారెలంటే నోరూరని వ్యక్తి ఎవరైనా ఉంటారా? గారెల్లో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ.. అల్లం గారెలంటేనే ఇష్టం చాలామందికి. అయితే.. వీటిని తయారు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. వర్షాకాలం, చలికాలం.. చల్లని సాయంత్రాన వేడి వేడి అల్లం గారెలు తింటే ఉంటది మజా. అది మాటల్లో వర్ణించలేము.
అల్లం గారెలు చేయడానికి మినప్పప్పు, అల్లం పేస్ట్, ఎండుకొబ్బరి తురుము, పచ్చి మిర్చి, జీలకర్ర, మిరియాలు, ఉప్పు, లవంగాలు, దాల్చిన చెక్క, నూనె, కొత్తిమీర, పూదీన, కరివెపాకు ఉంటే చాలు.
ముందుగా మినప్పప్పును నానబెట్టుకోవాలి. అల్లం పేస్ట్, ఎండుకొబ్బరి తురుము, పచ్చి మిర్చి, జీలకర్ర, మిరియాలు, ఉప్పు, లవంగాలు, దాల్చిన చెక్కను మిక్సీలో పట్టండి. తర్వాత అందులో మినప్పప్పు కూడా వేయండి. ఆ మిశ్రమంలో కొత్తిమీర, పూదీన, కరివెపాకు కూడా వేసి మళ్లీ ఓసారి రుబ్బండి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముద్దలు ముద్దలుగా చేసి గారెల్లా చేయండి. ఇంతలో మూకుడు తీసుకొని.. మూకుడులో నూనె పోసి మరిగించండి. నూనె వేడెక్కాక.. గారెల్లా చేసుకున్న ఆ మిశ్రమాన్ని నూనెలో వేసి వేయించండి. ముందూ వెనుక కాసేపు వేయించాక.. బయటికి తీసేయండి. అంతే.. వేడి వేడి అల్లం వడలు రెడీ. చట్నీతో చల్లని సాయంత్రాన వేడి వేడి అల్లం వడలను లాగించేయండి.