ఈటల రాజేందర్ (Etela Rajender) రాజకీయాలు నిజంగానే ఊహకు కూడా అందకుండా నడుస్తున్నాయి. మొన్నటి వరకు ఆయన ఏపార్టీలో చేరతారంటూ అంతా ఆసక్తిగా ఎదురుచూడగా.. దానిపై మాత్రం క్లారిటీ రాలేదనే చెప్పాలి. అయితే ఆయన టీఆర్ ఎస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. అదే క్రమంలో ఆయన ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను కమ్యూనిస్టు భావజాలం గల వ్యక్తినని, కానీ ఇప్పుడు తెలంగాణలో సీపీఐ, సీపీఎం ఎవరి ఆధీనంలో పనిచేస్తున్నాయో తెలుసునంటూ విమర్శలు చేశారు. ఇన్ డైరెక్టుగా ఆ పార్టీలు టీఆర్ ఎస్, కాంగ్రెస్ ఆధీనంలో మాత్రమే పనిచేస్తున్నాయని చెప్పారు.
సీపీఐ, సీసీఎం పోటీ చేయాలన్నా కూడా టీఆర్ ఎస్, కాంగ్రెస్ పర్మిషన్ తప్పనిసరి అన్నట్టు ఈటల వ్యాఖ్యానించారు. దీంతో సీపీఐ, సీపీఎం నేతలు భగ్గుమంటున్నారు. ఈటల కేవలం ఆస్తుల రక్షణ కోసమే బీజేపీలోకి వెళ్తున్నారంటూ మండిపడుతున్నారు. తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్‌రెడ్డి ఇదే విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమ్యూనిస్టు భావజాలం ఉన్నవారు బీజేపీలోకి వెళ్లరంటూ చురకలు అంటిస్తున్నారు. మొత్తంగా ఈటల మాటలు మరో కొత్త వివాదానికి తెర తీశాయి.