నీటి వివాదంపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. సాగునీటి విషయంలో ఇరుగు, పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కల్గి ఉండాలన్నదే సీఎం జగన్ విధానమని.. సమస్య పరిష్కారం కోసం తెలంగాణ సీఎంతో కూర్చుని చర్చించేందుకు సీఎం వైఎస్ జగన్ సిద్దమని స్పష్టం చేశారు. ఎవరైనా మాట్లాడితే సమస్య పరుష్కారమయ్యేలా ఉండాలి..విద్వేషాలు పెంచేలా ఉండకూడదని.. కానీ కొందరు తెలంగాణ నేతలు విద్వేషాలు పెంచేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెనుకబడిన రాయలసీమకు నీరు అందాల్సిన అవసరం ఉందని గతంలో కేసీఆర్ కూడా చెప్పారని.. 80 వేల క్యూసెక్కులైనా సరే రాయలసీమకు తీసుకోవాలని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు.
తక్కువ సమయంలో ఎక్కువ నీరు రాయలసీమకు లిఫ్టు చేయాలని చెప్పారని.. సీమకు నీరు అందేలా చేయడంలో రెండు అడుగులు ముందుంటానని కేసీఆర్ కూడా గతంలో చెప్పారన్నారు. కృష్ణా నదిలో రాష్ట్రానికి కేటాయించిన నీటినే మేము తీసుకుంటున్నామని.. 800 అడుగుల కంటే తక్కువలో తెలంగాణ నీరు తీసుకుంటుం డటంతో గతంలో జగన్ జలదీక్ష చేశారని చెప్పారు.
ఇప్పుడు కూడా కృష్ణాలో 800 అడుగులలోపే తెలంగాణ నీటిని పంపింగ్ చేస్తోందన్నారు. ఉభయ రాష్ట్రాలు బాగుండాలని గతంలో కేసీఆర్ కూడా అన్నారని.. నీటి వినియోగంపై కేంద్రం నుంచి మానిటరింగ్ టీం పెట్టినా ఇబ్బంది లేదని తెలిపారు. పరుషంగా మాట్లాడటం వల్ల ఏ సమస్యా పరిష్కారం కాదని..నీటి సమస్య పరిష్కరించేలా సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు.