తెలంగాణ పీసీసీ అధ్యక్ష పీఠం రేవంత్‌కు ఇవ్వడంతో, రాష్ట్రంలోని కాంగ్రెస్ శ్రేణులు బాగా యాక్టివ్ అయ్యాయి. కొందరు సీనియర్లు అసంతృప్తిగా ఉన్నా సరే కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం రేవంత్‌కు పీసీసీ ఇవ్వడంపై సంతృప్తిగానే ఉన్నారని తెలుస్తోంది. ఇంతకాలానికి కాంగ్రెస్‌లో దూకుడుగా ఉండే నాయకుడుకు పీసీసీ దక్కడంపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రేవంత్, కాంగ్రెస్‌కు కొత్త ఊపుని తీసుకురావడం ఖాయమని, అధికార టీఆర్ఎస్కు చెక్ పెట్టడం ఖాయమని భావిస్తున్నాయి.
అయితే రేవంత్‌కు అంత సీన్ లేదని తెలంగాణ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ చాప్టర్ క్లోజ్ అయిందని, రేవంత్ కూడా ఆ పార్టీని పైకి లేపలేరని మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని, నెక్స్ట్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామే అని కమలం నేతలు మాట్లాడుతున్నారు. ఇక విషయంలో రాజకీయ విశ్లేషకులు వర్షన్ వేరుగా ఉంది.
తెలంగాణలో కాంగ్రెస్‌ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని అంటున్నారు. అలాగే రేవంత్ సత్తాని కూడా తక్కువ చేయలేమని అంటున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో పీసీసీలు దూకుడుగా రాజకీయాలు చేయలేదని, కానీ రేవంత్ దూకుడు పార్టీకి కలిసొస్తుందని అంటున్నారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ బలం తగ్గలేదని, దాదాపు 50 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం ఉందని గుర్తు చేస్తున్నారు. అలాగే ఆ పార్టీకి బలమైన కేడర్ ఉందని చెబుతున్నారు.
ఇక రేవంత్ గట్టిగా కష్టపడితే కాంగ్రెస్ మరింత పుంజుకుని టీఆర్ఎస్కు ధీటుగా నిలబడుతుందని అంటున్నారు. అదే సమయంలో బీజేపీ కూడా పుంజుకున్న మాట వాస్తవమే అని, కాకపోతే బీజేపీకి రాష్ట్ర స్థాయిలో ఇంకా బలం పెరగలేదని, కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రం కమలానికి బలం ఉందని చెబుతున్నారు. పైగా దుబ్బాకలో గెలవడానికి రఘునందన్ వ్యక్తిగత ఇమేజ్ కారణమని, ఇప్పుడు హుజూరాబాద్ రేసులో బీజేపీ నిలబడటానికి ఈటల రాజేందర్ కారణమని అంటున్నారు.
జిహెచ్ఎంసి ఎన్నికల్లో సత్తా చాటాడానికి అన్నీ ప్రాంతాల వారు అక్కడ ఉండటమే కారణమని, అలాంటప్పుడు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని, కానీ అక్కడ బీజేపీ రేసులోనే లేదని, అలాగే నాగార్జున సాగర్ ఉపఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేదని గుర్తుచేస్తున్నారు. కాబట్టి వాపుని చూసి బలుపు అనుకుని ముందే తొందరపడి రేవంత్ బలాన్ని తక్కువ అంచనా వేస్తే బీజేపీకే నష్టమని అంటున్నారు.