తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. అనూహ్యంగా తెలంగాణలో పుంజుకున్న బీజేపీ, కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పిస్తుంది. ఎలాగైనా నెక్స్ట్ అధికారం దక్కించుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళుతున్న బీజేపీ, కేసీఆర్‌ని ఏ అంశంలో దొరికితే ఆ అంశంలో ఇరుకున పెట్టడానికి చూస్తుంది.
తాజాగా జిహెచ్‌ఎంసి పరిధిలో అక్రమ కట్టడాలు కూల్చివేతలపై కూడా బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకెళుతుంది. ఇక్కడ హిందూ మతం కార్డు వాడుతూ రాజకీయాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం కేవలం హిందువుల ఇళ్లను మాత్రమే టార్గెట్ చేస్తూ కూల్చివేతలు కొనసాగిస్తుండటం అన్యాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అవుతున్నారు.
ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కూల్చివేతలు నిలిపివేయాలని, ఖైరతాబాద్ జోన్, చార్మినార్ జోన్‌లో వేలాది అక్రమ నిర్మాణాలు కూల్చి వేసిన తర్వాతనే మిగతా జోన్లలో కూల్చివేతలు మొదలుపెట్టాలని అంటున్నారు. ఆ రెండు జోన్లలో ఎంఐఎం శాసనసభ్యుల ప్రాతినిధ్యం ఉందని చెప్పే, కేసీఆర్ ప్రభుత్వం వెనుకడుగు వేస్తుందని, అవి వదిలేసి హిందువుల ఇళ్లను మాత్రమే టార్గెట్ చేస్తూ కూల్చివేతలు కొనసాగిస్తుండటం దుర్మార్గమని అంటున్నారు.
మామూలుగానే బీజేపీ హిందూ మతం కార్డు వాడుతూనే రాజకీయాలు చేస్తుందనే సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే పరిస్తితి ఉంది. అందుకే ఇప్పుడు ఎంఐఎం పార్టీని టార్గెట్ చేస్తూ, కేసీఆర్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. మరి ఇలా చేయడం వల్ల రాజకీయంగా బీజేపీకి లబ్ది చేకూరుతుందనే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తోంది. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కూడా ఈ ఫార్ములా ద్వారానే బీజేపీ సక్సెస్ అయింది. మరి రానున్న రోజుల్లో ఈ మతం కార్డు బీజేపీకి ఏ మేర లబ్ది చేకూరుస్తుందో చూడాలి.