తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే హుజూరాబాద్ ఉపఎన్నిక అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. మరోవైపు ప్రతిపక్షాలు మూకుమ్మడిగా కేసిఆర్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. అటు టిఆర్‌ఎస్ కూడా ప్రతిపక్షాలు దాడిని తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇలా తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా నడుస్తున్న సమయంలోనే కేసిఆర్, ప్రధాని మోదీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణలో టిఆర్‌ఎస్, బిజేపిల మధ్య ఎలాంటి వార్ జరుగుతుందో అందరికీ తెలిసిందే. అయితే ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, ఆ రెండు పార్టీలు ఒక్కటే అని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కేంద్రంలో బిజేపి, టిఆర్‌ఎస్‌లు మంచి సఖ్యతతో ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో టిఆర్‌ఎస్ కార్యలయం కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఇక తాజాగా కేసిఆర్, ప్రధాని మోదీతో పాటు ఇతర కేంద్ర మంత్రులని కలిశారు.
మామూలుగా ఒక సిఎం హోదాలో కేసిఆర్, ప్రధాని మోదీని కలవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ తెలంగాణలో బిజేపి-టిఆర్‌ఎస్‌లు నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ….బిజేపి-టిఆర్‌ఎస్‌లు ఒక్కటే అని ప్రచారం చేస్తున్న సమయంలో కేసిఆర్-మోదీల కలయిక తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. టిఆర్‌ఎస్-బిజేపిలు ఒక్కటే అని కాంగ్రెస్ చేస్తున్న వాదనకు బలం చేకూరినట్లైంది.
ఇదే సమయంలో ప్రధాని మోదీని కలవడానికి కేసీఆర్ పడిగాపులు పడ్డారని, ఇక కేసిఆర్…టీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటేనన్న భావన ప్రజల్లో కల్పించి లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తారని, కోతల రాయుడి మాటలు విని మోసపోవద్దని తెలంగాణ బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్నారు. అంటే టిఆర్‌ఎస్-బిజేపిలు ఒక్కటే అని ఎలాగో ప్రచారం వస్తుందని బండి ముందే అలెర్ట్ అయినట్లు కనిపిస్తోంది. మరి ఆ రెండు పార్టీలు ఒకటో కాదో భవిష్యత్‌లో తెలుస్తోంది.