383 రోజుల తర్వాత.. ఘాజీపూర్ బార్డర్ వీడిన రాకేశ్ తికాయత్

-

మూడు వ్యవసాయ చట్టాల(ప్రస్తుతం రద్దు చేశారు)కు వ్యతిరేకంగా రైతుల ఆందోళనకు నేతృత్వం వహించిన భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ దేశ రాజధానిని వీడారు. 383 రోజుల తర్వాత ఢిల్లీలోని ఘజియాబాద్ బార్డర్‌ను వీడి ఇంటికి పయనమయ్యారు. విజయంతో తిరిగి వస్తున్న రైతు నేతకు ఘన స్వాగతం పలికేందుకు తికాయత్ స్వగ్రామం ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని సిసౌలిలో ఘనంగా ఏర్పాట్లు చేశారు.

వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండు చేస్తూ వందల మంది రైతులతో కలిసి ఢిల్లీలోని ఘాజిపూర్ సరిహద్దుల్లో రాకేశ్ తికాయత్ మఖాం వేశారు. చివరికి రైతుల డిమాండ్లకు తలొగ్గి మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వంతో కిసాన్ సంయుక్త మోర్చా(ఎస్‌కేఎం) ఒప్పందం చేసుకున్నది.

తమ డిమాండ్లు నెరవేరడంతో రైతు నేతలు ఆందోళన విరమిస్తునట్టు ప్రకటించారు. దీంతో ఢిల్లీలోని సింఘు, టిక్రి, ఘాజీపూర్ సరిహద్దుల్లో మకాం వేసిన రైతులు ఇండ్లకు తిరిగి ప్రయాణమయ్యారు. డిసెంబర్ 16 తర్వాత ఘాజీపూర్ బార్డర్‌ను ఖాళీ చేయనున్నట్లు రాకేశ్ తికాయత్ వెల్లడించారు. బుధవారం ఘాజీపూర్ సరిహద్దును వీడనున్న ఆయన 383 రోజుల తర్వాత ఇంటికి వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news