హత్యా రాజకీయాలతో కేరళ అట్టుడుకుతోంది. వరసగా వేరేవేరే పార్టీకు చెందిన ఇద్దరు నేతలు హత్యకు గురయ్యారు. 12 గంటల వ్యవధిలో ఈ రెండు హత్యలు చోటు చేసుకోవడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కేరళలోని అలప్పుజా జిల్లాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. దీంతో అలప్పుజ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. సోషల్ డెమోక్రాటిక్ ఛీప్ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) నేత కేఎస్ షాన్ ను కొందరు దుండగులు శనివారం రాత్రి దారుణంగా హత్య చేశారు. పార్టీ ఆఫీసు నుంచి బండిపై ఇంటికి వెళ్తున్న షాన్ ను కారుతో ఢీకొట్టి, కొట్టి చంపారు. అయితే ఈ హత్య ఆర్ఎస్ఎస్ చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే 12 గంటల వ్యవధిలో బీజేపీ నేత, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్ కత్తితో పొడిచి చంపబడ్డాడు. ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు రంజిత్ ను చంపారు. ఈ హత్య షాన్ హత్యకు ప్రతీకారంగానే జరిగిందని తెలుస్తోంది. అయితే అంశంపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇది మొదటి సంఘటన కాదని.. కొన్ని వారాల క్రితం పాలక్కాడ్లో బీజేపీ కార్యకర్త ఇలాగే హత్యకు గురయ్యాడని బీజేపీ నేతలు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్లామిక్ టెర్రరిస్టులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్ అలప్పుజాలో జరిగిన రెండు హత్యలను ఖండించారు.