అబద్ధాలు చెప్పండి
కాదనం కానీ
అతికిన విధంగా ఉండాలె
ఫెవిక్విక్ కు ఉన్నంత బలం ఉండాలె
అప్పుడు మాత్రమే మీరు ఏం చెప్పినా
మేం వినాలె నమ్మాలే తరువాత
నవ్వాలే.. హా హా హా ! ఏమంటారు సామీ!
ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అది.. తిరుగే లేని హవాతో ఉన్న పార్టీ అది.. ఒకప్పుడు ఆడింది ఆట పాడింది పాట అయిన పార్టీ అది. కానీ ఇప్పుడు ఎలా ఉంది. జిల్లా కార్యాలయల పేరిట దండిగానే సంపాదించినా పాపం అప్పులున్నాయని మనలాంటి అల్పులకు వివరం ఇస్తున్నారు అల్లుడు బాబు.. అంటే ఎన్టీఆర్ భవన్ ఆస్తి కోట్ల విలువ చేయడం లేదా? పోనీ ఇతర ఆస్తుల విలువ ఏంటన్నది లెక్కల్లోకి రావడం లేదా? చెప్పేవాడు చంద్రబాబు అయితే వినేవాడు లోకేశ్ బాబు కావాలి అని ఓ సెటైర్ ఉంది లేండి.. దానినే పాటిస్తూ ముందుకు పోవడం మన ముందరి, మనందరి కర్తవ్యం కావాలి.
ప్రాంతీయ పార్టీలలో గులాబీ దండు ఆస్తి మూడు వందల కోట్లకు పైగా ఉంటే తెలుగుదేశం పార్టీ ముప్పయి కోట్ల రూపాయలకు పైగా అప్పులతో ఉంది అని తేలిపోయింది ఇవాళ. పార్టీల ఆస్తులు తదితర వివరాలను ఇవాళ ఓ సంస్థ విడుదల చేసింది. ఆసక్తి ఏంటంటే డీఎంకే, అన్నా డీఎంకేలు కూడా పెద్దగా వెనకేసుకోలేదు అని కూడా తేలిపోయింది. అంటే ఈ రెండు పార్టీల కన్నా టీఆర్ఎస్ మాత్రమే అటు ఢిల్లీ డీల్స్ లోనూ.. ఇటు లోకల్ డీల్స్ లోనూ ముందుండి నాలుగు రూపాయలు దండిగానే వెనకేసుకుంటుంది అన్నది ఓ వాస్తవం. మరి! టీడీపీ ఆస్తుల మాటేంటో? అదొక్కటే తెలియడం లేదు!
ఆంధ్రావని వాకిట ఒకప్పటి ప్రభంజన వీచిక తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అన్న ఎన్టీఆర్ మొదలుకుని ఈరోజు చంద్రబాబు వరకూ పార్టీ విషయమై తీసుకున్న ప్రతి విషయమూ, పరుగులెత్తించిన తీరు ఇవన్నీ సంచలనమే! ఎన్టీఆర్ రాకే ఓ ఊహాతీతం.. ఆయన మాట వేల, లక్షల ప్రజలకు శిరోధార్యం. అలాంటి పార్టీ ఇప్పుడు ఎలా ఉంది. ఎన్టీఆర్ తరువాత కూడా అదే ఊపు కొనసాగించారు చంద్రబాబు.
ఉమ్మడి ఆంధ్రకు, విభజిత ఆంధ్రకు ముఖ్యమంత్రి హోదాలో మంచిగానే సేవలందించారు. అలాంటి పార్టీ ఇప్పుడు ఏమౌతుంది? దేశంలో నాలుగు జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీలలో 30కోట్లకుపైగా అప్పులున్న పార్టీగా రికార్డులకెక్కింది. తాజాగా అసోసియేషన్ ఆఫ్ డెమక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన డేటాలో టీడీపీ అప్పు ఎంతన్నది తేలిపోయింది. అన్నింటి కన్నా ఎక్కువ ఆస్తి ఉన్న పార్టీగా జాతీయ స్థాయిలో ఇప్పుడు చక్రం తిప్పుతున్న బీజేపీనే కావడం విశేషం. ఈ పార్టీ ఆస్తులు నాలుగు వేల కోట్లకు పైగా ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందే! మరి! బాబు గారు అప్పెందుకు చేశారు? ఎందుకని ఆయన అప్పులో మునిగాము నిండా అని పాడుకుంటున్నారు? ఏమో కానీ ఏదో ఒకటి వాళ్లే తేల్చాలి.