ప్రపంచ అగ్రరాజ్యంగా ఎదిగేందుకు చైనా తహతహలాడుతోంది. అమెరినా వెనక్కి నెట్టి పెద్దన్న పాత్ర పోషించాలని అనుకుంటుంది. ఇప్పటికే ఆర్థికంగా చైనా.. అమెరికాకు సవాల్ విసురుతోంది. మరోవైపు సైనిక పరంగా కూడా తన సత్తా చాటాలని చైానా భావిస్తోంది. అమెరికా, రష్యా తర్వాత అతి శక్తివంతమైన సైన్యం చైనా సొంతం. తన సైన్యాన్ని మరింత ఆధునీకీకరించేందుకు చైనా సమాయత్తం అవుతోంది. సైనికపరంగా ప్రపంచ దేశాలకు తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. దీంతో చైనా ఈ ఏడాది తన రక్షణ బడ్జెట్ ను గణనీయంగా పెంచనుంది. 2022లో డిఫెన్స్ బడ్జెట్ 230 బిలియన్ డాలర్లుగా ఉంటుందని డ్రాగన్ దేశం వెల్లడించింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 7.1 శాతం ఎక్కువ.దేశ సార్వభౌమత్వం, రక్షణలో రాజీపడేదే లేదని చైనా స్పష్టం చేసింది.
చైనా తన దుందుడుకు తనంలో తన సరిహద్దు దేశాలకు శత్రువుగా మారింది. చైనాకు సరిహద్దుల్లో ఉన్న మంగోలియా, జపాన్, ఫిలిప్పీన్స్, తైవాన్ దేశాలతో కయ్యానికి కాలుదువ్వుతోంది. మరోవైపు నిత్యం భారత్ కు చికాకులు పుట్టిస్తోంది. తన సైనిక సత్తా చూపి ఇతర దేశాలను లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. దక్షిణ చైనా సముద్ర తీరంలో గుత్తాధిపత్యానికి ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే జపాన్ కు సంబంధించిన దీవులను తమవిగా చెప్పుకుంటూ… ఎప్పుడూ ఉద్రిక్తతలను పెంచుతోంది. ఇక అరుణాచల్ ప్రదేశ్, లడఖ్, కాశ్మీర్ వ్యవహారాల్లో భారత్ తో గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది. గల్వాన్ ఘర్షణ తర్వాత చైనాకు మన సైన్యం రుచి తెలిసింది. ఇక ఇండోఫసిఫిక్ రీజియన్ లో చైనాను అడ్డుకునేందుకు భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ కలిసి క్వాడ్ కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ పరిస్థితులు మధ్య చైనా తన రక్షణ రంగ బడ్జెట్ ను చాలా పెంచింది.