ఏపీ జీవనాధారం పోలవరం..!

-

పోలవరం ప్రాజెక్ట్ కొన్ని వందల ఏళ్ల నాటి కల. ఈ ప్రాజెక్టు వెనుక ఎంతో ఘన చరిత్ర, పేద ప్రజల కడుపుకోత, రైతన్నల కన్నీటి ధార పోత దాగి ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ ప‌నులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. అధికారుల కాగితాలలో, కాంట్రాక్టర్ల డబ్బుల రూపంలో మాత్రమే ప్రాజెక్టు ప‌నులు శ‌ర‌వేగంగా జరుగుతున్నాయి కానీ ఇప్పటికీ పూర్తి ఫలితం ప్రజలకు అందలేదు అన్న‌ది ఓ వ‌ర్గం వాద‌న‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విభ‌జ‌న తర్వాత పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యేక హోదా కల్పిస్తామని ఆనాడు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆ హామీ ఇప్పటికీ అమలు కాక ప్రాజెక్టు పూర్తి కాక ఎంతో మంది ప్రజలు క‌ళ్ల‌ల్లో వ‌త్తులేసుకుని మ‌రీ ! ఎదురుచూస్తున్నారు.

వాస్త‌వానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 1870లో తొలిసారి కట్టాలని ఆలోచన వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు 1941లో ఆనాటి ఇంజినీర్ వెంకట కృష్ణ అయ్యర్ గోదావరి మీద పోలవరం సమీపంలో ప్రాజెక్టు కట్టాలన్న ఆలోచన చేశారు. గోదావ‌రి నీళ్లు భ‌ద్రాద్రి రాముని పాదాల‌ను తాకే ప్రాంతంలో 150 అడుగుల ఎత్తులో డ్యామ్ నిర్మాణానికి పూనుకోవాల‌ని అనుకున్నారు.150 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో డిజైన్ రూపొందించారు. ఇంత పెద్ద ప్రాజెక్టులో దాదాపుగా 40 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తయారవుతోందని అంచనావేశారు. రెండు ప్రధాన కాలువల ద్వారా రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లు అందించేందుకు ఆలోచన చేశారు.

కానీ ఇప్పటివరకూ ఏ ప్రభుత్వ ప్ర‌తినిధులూ ఆచరణలో పెట్టలేకపోయారు. ఈ మధ్యకాలంలో అసెంబ్లీ ఈ సమావేశాల్లో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2023 కల్లా ప్రాజెక్టును సిద్ధం చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు ప్రాజెక్టులో నిర్వాసితుల‌యిన లక్ష కుటుంబాలకు కనీసం పునరావాసం కూడా కల్పించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం చాలా బాధాకరం.

7962 మంది కుటుంబాలు మాత్రమే పునరావాసం కల్పించి,మిగతా బాధితులంద‌రికీ ఆవాసం కల్పిస్తామని చెబుతూ వెళ్తున్నారే తప్ప ! వారిని ఏ విధంగా ఆదుకోవడం లేదు అన్న వాద‌న ఒక‌టి వినిపిస్తోంది. ప్రాజెక్టు పనులు దాదాపుగా 72 శాతం పూర్తి అయిపోయాయి. మిగతా పనులు త్వరలోనే పూర్తి చేస్తామని..నిర్వాసితులు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ప్రభుత్వం
హెచ్చరికలు జారీ చేస్తోంది. కానీ ప‌రిహారం కింద ఎకరానికి 20 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది కానీ చెల్లించలేదు.
దీంతో తాము ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లేదే లేద‌ని నిర్వాసితులు ఖ‌రాఖండీగా చెబుతున్నారు. దీనిపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ క‌నీసం ఆలోచన చేయకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెబుతున్నారు. అదే విచార‌క‌రం.


రాష్ట్ర విభజన సమయంలో ఆనాడు ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి పూర్తి వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని చెప్పి ప్రస్తుతం మాట మార్చడం పేద ప్రజల కడుపు కొట్టడమే అవుతుందని ప్ర‌జా సంఘాలు గ‌గ్గోలు పెడుతున్నాయి. ప్రాజెక్టు విష‌యంలో అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ, ప్రస్తుత వైసీపీ పార్టీ గాని ఏనాడూ కేంద్రాన్ని గట్టిగా నిలదీసి అడగడంలో విఫలమయ్యారని ఆవేద‌న చెందుతున్నాయి. ఏది ఏమైనా ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కొంతమంది జీవితాలు బలైనప్ప‌టికీ, ప‌నులు పూర్త‌యితే పోల‌వ‌రం ఎంద‌రో రైతులకు జీవనాధారం అవుతుందనేది జగమెరిగిన సత్యం.

 

– పాండ్రాల మోహన్

Read more RELATED
Recommended to you

Latest news