నార్త్ పార్టీలు ఒప్పుకుంటాయా.. కేసీఆర్..నెగ్గుకురాగలరా..?

-

‘‘ఇది రాజకీయపార్టీల పున‌రేకీక‌ర‌ణ కాదు.బీజేపీకి వ్యతిరేకంగా ఏకం కావ‌డం.. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జట్టుకట్టడం కాదు. మోదీని దించ‌డం..మ‌రొక‌రిని కూర్చోబెట్టడం..త‌ర్వాత ఆ వ్యక్తిని దించ‌డం..మ‌రొక‌రిని ఎక్కించ‌డం అస‌లే కాదు. మ‌న‌కు కావాల్సింది ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా.ఇప్పుడున్న జాతీయ పార్టీలకు ఉన్న ఎజెండాకు భిన్నమైన ఎజెండా. అది దేశ ప్రజ‌ల అభివృద్ధికి సంబంధించినది. పారిశ్రామిక పురోభివృద్ధికి చెందినది.’’ అని ప్లీనరీ వేదికగా గులాబీ బాస్ కేసీఆర్ కుండ బద్దలు కొట్టారు. దీనిని బట్టి.. తాను కూటములు కట్టనని, ఫ్రంట్లు పెట్టనని స్పష్టమవుతోంది.దేశానికి సంబంధించి ఒక ప్రత్యేక ప్రత్యామ్నాయ అజెండాను ముందుకు దానికి మద్దతుగా పార్టీలను కూడగట్టడమే తన పని అని పరోక్షంగా స్పష్టం చేసినట్లయింది.

అయితే.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం..ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతోనే కేసీఆర్ ఇలా ఆచితూచి మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫెడరల్ లేదా మూడో కూటమి లేదా ఫ్రంట్లు అని పెడితే.. తనను కాంగ్రెస్ లేదా బీజేపీకి అనుకూలమనే ముద్ర వేసే ప్రమాదముందనే గ్రహించి అత్యంత జాగరూకతతో ఈ ‘ప్రత్యామ్నాయ’ ఎజెండాను ముందుకు తెచ్చారని విశ్లేషకులు అంటున్నారు.

తెలంగాణ ఉద్యమం కూడా దశలు దశలుగా..అజెండా ప్రకారం మొదలయ్యిందని.. అందులో అన్నివర్గాలు చేరిన తర్వాత ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందని.. దానివల్లే మిగతా పార్టీలు కూడా తెలంగాణకు అనివార్యంగా మద్దతు పలికాయని.. తద్వారా తెలంగాణ సాధ్యమందని కేసీఆర్ కు తెలుసు. అందుకే మూడో ప్రత్యామ్నాయం కూడా అజెండాతో రూపొందాలని.. దానిని దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే.. పార్టీలు తమంతట తామే దీనికి మద్దతు పలుకుతాయని కేసీఆర్ ఆశిస్తున్నట్లుగా భావిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల తర్వాతే ఈ ఎజెండా ప్రక్రియ మరింత ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయని.. అప్పటి వరకు ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. వాటిని పట్టించుకునే అవకాశాలు లేవంటున్నారు. అయితే.. దక్షిణాది వారు అంటేనే చిన్న చూపు ఉండే ఉత్తాది పార్టీలు.. దక్షిణాది వ్యక్తి ప్రతిపాదించే అజెండాను ఆమోదిస్తారా? అన్నది పెద్ద ప్రశ్న. ఉత్తరాది రాజకీయ పార్టీలను తట్టుకుని నెగ్గుకురాగలరా? అన్నది మరో అతి పెద్ద ప్రశ్న.

Read more RELATED
Recommended to you

Latest news