ఏ విధంగా చూసుకున్నా ఆంధ్రా కన్నా తెలంగాణ చాలా అంటే చాలా ముందుంది. అందుకు కారణాలు ఏమయినా కూడా వైద్య రంగంలో వస్తున్న మార్పులను అందుకుంటోంది. ఇదే సమయంలో ప్రజావసరాల మేర స్పందిస్తుంది కూడా ! ఇదే సమయంలో నాటి ఉమ్మడి రాష్ట్ర పాలకులను ఎప్పటికప్పుడు టీ సర్కారు తిట్టిపోస్తోంది. ఆ రోజు తెలంగాణకు చీకటే అన్న వారు ఇప్పుడేమయ్యారు అని కేసీఆర్ అంటే, ఉమ్మడి రాష్ట్రం కన్నా తాము ఇప్పుడే బాగున్నామని ఇతర నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఏదేమయినప్పటికీ అభివృద్ధికి సంబంధించి ఆంధ్రా కన్నా తెలంగాణలో చేపడుతున్న పనులు బాగున్నాయి. రాజధాని లేని కారణంగానే ఏపీ వెనకబడిపోతోంది అని చెప్పలేం కానీ, కొన్నింటిని మినహాయించి ఆలోచించినా కూడా ఏపీ ఇవాళ చాలా అంటే చాలా వెనుకబాటులో ఉంది. అందుకే ఇక్కడి పాలకులు తెలంగాణ నాయకుల మాటలను కానీ లేదా వారు చేస్తున్న అభివృద్ధితో పోటీ పడడం కానీ చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను తెరపైకి తెచ్చారు కేసీఆర్. ఇది కూడా తమ నేత దార్శినితకు సంకేతమని, మారుతున్న కాలం, ప్రజావసరాల రీత్యా నగరంలో మూడు చోట్ల టిమ్స్ కు శ్రీకారం దిద్దామని హరీశ్ చెప్పారు.
ఆ క్రమంలో భాగంగా ఉప్పల్, అల్వాల్, ఎర్రగడ్డలో టిమ్స్ ఏర్పాటుకు నిన్నటి వేళ శంకు స్థాపన చేశారు. ఓ విధంగా ఇది సాహసోపేత చర్య అనే చెప్పాలి. అసలు ప్రభుత్వ దవఖానాలు అన్ని కాలం చెల్లినవే అన్న అపవాదును పోగొట్టేందుకు, గాంధీ, ఉస్మానియా లాంటి ఆస్పత్రులకు ఆధునిక సౌకర్యాలు ఇస్తూనే,అదే సమయాన టిమ్స్ లాంటి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి స్థల సేకరణ చేయడం, భూమి పూజ చేసి పనుల నిర్వహణకు సంబంధించి నిధులు కేటాయించడం ఎంతో శుభ పరిణామం. కానీ ఇదే సమయంలో ఏ మాటకు ఆ మాట ఆంధ్రా వెనుకబడే ఉంది. కొత్త ఆస్పత్రి ఒక్కటంటే ఒక్కటి లేదు అని చెప్పేందుకు కారణాలు అనేకం. మంగళగిరి ఎయిమ్స్ కూడా కేంద్రం నిర్మించిందే ! అదే తెలంగాణలో అయితే ఉస్మానియా లాంటి ఆస్పత్రుల్లో కీళ్ల మార్పిడి, కిడ్నీ మార్పిడి వంటి ఖరీదయిన శస్త్ర చికిత్సలకు సైతం వైద్యులు ఉన్నారు. సంబంధిత పరికరాలూ ఉన్నాయి. హృద్రోగ సంబంధ సమస్యలకు సైతం ఇక్కడే చికిత్స పొందే వెసులుబాటు ఉంది. వైద్యానికి టీ సర్కారు ఇస్తున్న ప్రాధాన్యం బాగుంది అన్న వాదన ప్రజల నుంచి వస్తోంది.
ఈ నేపథ్యంలో నాటి తమ వెనుకబాటును తల్చుకుంటూనే ఉమ్మడి రాష్ట్ర పాలకుల పని తీరు ఎంత పేలవంగా ఉండేదే చెప్పకనే చెప్పారు హరీశ్. కాంగ్రెస్ నేతలు, ఆంధ్రా పాలకులు ఉంటే ఎక్కడ ఏం దొరుకుతుందని చూసేవారు తప్ప. భవిష్యత్తు అవసరాల కోసం ఆలోచించేవా రు కాదు. ప్రజల సోయి ఉండేది కాదు. అధికారులు, కాంట్రాక్టర్లు చెబితేనే పని చేసే వారు… అని అంటూ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆంధ్రా పాలకులను టార్గెట్ చేశారు.