ఆ రోజు రంగులు చల్లుకున్నారు. స్వీట్లు తిన్నారు తినిపించుకున్నారు. దిశ (హత్యాచార బాధితురాలు) విషయమై సత్వరమే స్పందించిన వైనంపై విపరీతం అయిన ప్రశంసలు కూడా పోలీసులు అందుకున్నారు. అవన్నీ సజ్జనార్ ను హీరోను చేశాయా? ఏమో ! మరి ఇప్పుడేమయింది.. భావోద్వేగాలు కన్నా సిసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఇప్పుడయినా ఉన్నాయా ? అన్నదే సందేహం. కానీ ఆ రోజు సీపీ గా ఉన్న సజ్జనార్ మాత్రం ఇందుకు విరుద్ధంగా మాట్లాడుతుండడమే సిసలు తగాదాకు కారణం అని ప్రజా సంఘాలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అయినా కూడా ! నిజాలు అన్నవి మళ్లీ మళ్లీ దేవుడికే ఎరుక !
అబద్ధాలు ఎన్నయినా చెప్పండి ఎవ్వరూ ఏమీ అనరు. కానీ నిజాన్ని మాత్రం అంగీకరించడంలో మనసు చెప్పేది వినండి. ఆ విధంగా దిశ ఎన్కౌంటర్ కు సంబంధించి నాటి పోలీస్ బాస్ సజ్జనార్ (అప్పటి హైద్రాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్) కు సంబంధించి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. అంటే ఆ రోజు చెప్పిన అబద్ధాలకూ, ఇప్పుడు సిర్పుర్కర్ కమిషన్ చెబుతున్న నిజాలకూ మధ్య ఉన్న వ్యత్యాసంపై మాట్లాడితే బాగుంటుంది అని పౌర హక్కుల సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. అమాయలకు విధించే శిక్ష శర వేగంగా అమలులో ఉంటుందని ఈ ఎన్కౌంటర్ నిరూపణ చేస్తోందని వారంతా ఆవేదన చెందుతున్నారు.
ఆ రోజు ఆత్మరక్షణకే కాల్పులు జరిగాయి లేదా జరిపారు అనేందుకు ఆధారాల్లేవ్ అని తేలిపోయింది. అంటే ఇదొక ఫేక్ ఎన్కౌంటర్ అని అంటోంది సుప్రీం కోర్టు నియమించిన విచారణ కమిషన్. మరి! నిజాలు ఏమయ్యాయి ? ఎక్కడికి పోయాయి ? ఏ అడవి దారిన అవి దాగి ఉన్నాయి ? వీటిపై కూడా మాట్లాడితే బాగుంటుంది కదా !
ఇప్పటికే పలు సార్లు కమిషన్ ఎదుట హాజరైన సజ్జనార్ ఆ రోజు ఘటనకూ తనకూ ఎటువంటి సంబంధమూ లేదని తేల్చేశారు. ఆ కేసును తాను పర్యవేక్షించలేదని, ఎప్పటికప్పుడు వివరాలు ఇవ్వాలని ప్రత్యేక బృందాలకు చెప్పినా, అవి తన మాటను పట్టించుకోలేదని గతంలో ఓ సారి ఓ స్టేట్మెంట్ ఇచ్చారాయన. ఈ కేసును శంషాబాద్ డీసీపీ పర్యవేక్షించారు అని, తనకూ ఈ కేసుకూ సంబంధమే లేదని కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇవ్వడం అప్పట్లో పెను సంచలనం అయింది. అంటే సజ్జనార్ ఆ రోజు అబద్ధం చెప్పారా లేదా పౌర సమాజం ఇదంతా నిజం అనుకుని సజ్జనార్ ను ఆకాశానికి ఎత్తేస్తూ.. అబద్ధాలను నిజం అని భ్రమ పడి సంబరాలు చేసుకుందా ? ఏమో నిజాలు మరియు అబద్ధాలు అన్నవి దేవుడికే ఎరుక !