రోజురోజుకు కామాంధులు రెచ్చిపోతున్న తరుణంలో ప్రజలకు కోపంతో నిందితులకు దేహశుద్ది చేసి నిప్పంటించారు. బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడటంతో ఆగ్రహించిన స్ధానికులు నిందితులను సజీవ దహనం చేశారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి కాలిన గాయాలతో మరణించగా మరో నిందితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో ఈ దారుణం వెలుగుచూసింది. పొరుగు గ్రామంలో పెండ్లి వేడుకకు హాజరై బాధితురాలి కుటుంబం గ్రామానికి తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగింది.
బస్‌లు లేకపోవడంతో అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను వారి బైక్‌పై బాలికను డ్రాప్ చేయాలని బాధితురాలి తండ్రి కోరాడు. గ్రామానికి వెళుతున్న క్రమంలో బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లిన నిందితులు ఆమెపై లైంగిక దాడి చేశారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత బాలిక జరిగిన విషయం చెప్పడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆగ్రహంతో నిందితులకు దేహశుద్ధి చేశారు. వారిపై కిరోసిన్ చల్లి నిప్పంటించారు. దీంతో ఓ నిందితుడు మరణించగా కాలిన గాయాలైన మరో వ్యక్తిని రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)కు తరలించారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు పోలీసులు.