మీ కారణంగా దేశ ప్రజలు తలదించుకోవాల్సి వస్తోంది, మీ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది, మేకిన్ ఇండియా అంటే ఇదేనా? పెద్ద కంపెనీలన్నీ దేశం నుంచి వెళ్లిపోయాయి, మోడీని చూసి పెద్ద పరిశ్రమలు పారిపోతున్నాయని ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్.
శ్రీలంక విషయంలో మీరు మాట్లాడకపోతే.. మిమ్మల్ని దోషిగా పరిగణిస్తామని… మీరు దోషి కాదని రేపటి బహిరంగసభలో వివరణ ఇవ్వండని పేర్కొన్నారు కేసీఆర్. రూపాయి పతనంపై మన్మోహన్ హయాంలో గొంతు చించుకున్నారు, మరి మీ పాలనలో రూపాయి ఎలా పతనమవుతుందో రేపు మాట్లాడండి, రూపాయి పతనం చేస్తే మీ పాలన ఎంత గొప్పదో అర్థమవుతుందన్నారు కేసీఆర్.
మహారాష్ట్రలో ఉద్దవుతాక్రే ప్రభుత్వాన్ని కూలగొట్టినట్లు తెలంగాణలో చేస్తామని ఓ కేంద్ర మంత్రి అంటున్నాడని సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఇలాగే రాష్ట్ర ప్రభుత్వాలపై.. కేంద్రం కన్ను పడితే.. తాము ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని పడగొడతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం కోసం 14 ఏళ్లు పోరాటం చేశామని… అవసరమైతే కేంద్రంపై పోరాటం చేసేందుకు తాము సిద్ధమని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. తమకు ప్రస్తుతం 104 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.