తాను ఇచ్చిన మాట మీద నిలబడతానని, తమ పార్టీకి సీట్లు రాకపోయినా, తాను రెండు చోట్ల ఓడిపోయినా సరే.. తన తుదిశ్వాస ఉన్నంత వరకు రాజకీయాల్లోనే ఉంటానని, ప్రజలకు సేవ చేస్తానని.. పవన్ స్పష్టం చేశారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ టీడీపీకి ప్రజలు షాకిచ్చారు. దీంతో ప్రతిపక్ష పార్టీ వైకాపా అప్రతిహత విజయంతో భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే అటు టీడీపీ అధినేత, ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు తమ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఇప్పటికే స్పష్టం చేయగా, మరోవైపు గాజు గ్లాసు గుర్తు పార్టీ జనసేన కూడా తమ ఓటమిని అంగీకరించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత పవన్ మీడియాతో మాట్లాడారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ గత కొంత సేపటి కిందటే విజయవాడలో మీడియాతో మాట్లాడారు. తాను రెండు చోట్ల ఓడిపోయినా తనకు బాధలేదని అన్నారు. అయినప్పటికీ తాను ప్రజల్లోనే ఉంటానని తెలిపారు. తమ పార్టీకి ఒక్క సీటు రాకపోయినా సరే.. ప్రజా క్షేత్రంలోనే ఉంటానని బదులిచ్చారు. అలాగే పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ, విదేశాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఓటు వేసిన వారికి, వేయించినవారికి తన ధన్యవాదాలు తెలిపారు.
ఇక భారీ మెజారిటీలో గెలుపొందబోతున్న వైకాపాకు, సీఎంగా ఈ నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్కు పవన్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మరోసారి కేంద్రంలో అధికారం చేజిక్కించుకున్నందుకు మోడీకి కూడా పవన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో వైకాపా ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఇక ఈ ఎన్నికల్లో జనసేన వినూత్న రీతిలో రాజకీయాలు చేసిందని, యువతకు ఎక్కువగా సీట్లు ఇచ్చామని, ఎక్కడా డబ్బు, మద్యం పంచలేదని పవన్ అన్నారు. అలాగే తాను ఇచ్చిన మాట మీద నిలబడతానని, తమ పార్టీకి సీట్లు రాకపోయినా, తాను రెండు చోట్ల ఓడిపోయినా సరే.. తన తుదిశ్వాస ఉన్నంత వరకు రాజకీయాల్లోనే ఉంటానని, ప్రజలకు సేవ చేస్తానని.. పవన్ స్పష్టం చేశారు.