మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి జరిగిన ఓట్ల లెక్కింపులో మొదట్నుంచీ నువ్వా, నేనా అన్నట్లుగా లోకేష్‌కు, ఆర్కేకు మధ్య టఫ్ ఫైట్ నడిచింది. కానీ చివరకు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆర్కే ఎన్నికల్లో గెలిచారు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచినా.. ఓటమి బారి నుంచి తప్పించుకోలేకపోయారు. వైకాపా అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేతిలో పరాజయం చవిచూశారు. సుమారుగా 5వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఆర్కే మంగళగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రజలు పనిచేసే నేతకే మరోసారి పట్టం కట్టారు.
మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి జరిగిన ఓట్ల లెక్కింపులో మొదట్నుంచీ నువ్వా, నేనా అన్నట్లుగా లోకేష్‌కు, ఆర్కేకు మధ్య టఫ్ ఫైట్ నడిచింది. కానీ చివరకు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆర్కే ఎన్నికల్లో గెలిచారు. అయితే ఆర్కే గెలుపు ముందుగా ఊహించిందే. ఎందుకంటే ఆయనకు మొదట్నుంచీ మంగళగిరి నియోజకవర్గంలో మంచి పేరుంది. పేద ప్రజలను ఆదుకునే గొప్ప మనస్సున నేతగా మంగళగిరి ప్రజలు ఆర్కేను కొనియాడుతుంటారు. కేవలం రూ.4కే సొంత ఖర్చులతో తన నియోజకవర్గంలోని పేదలకు నిత్యం భోజనం పెట్టడం చాలా మందికి నచ్చింది.
అలాగే ఆర్కేకు ప్రజా సమస్యలపై స్పందించి వాటిని పరిష్కరించడంలోనూ మంచి గుర్తింపు ఉంది. అందుకనే ఆయన్ను మరోసారి మంగళగిరి ప్రజలు ఆశీర్విదించారు. దీంతో గెలుపు లాంఛనమే అయింది. కాగా ఏప్రిల్ 11వ తేదీన తొలిదశ ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుంచి నేటి వరకు దాదాపుగా 46 రోజుల పాటు మంగళగిరిలో ఎవరు గెలుస్తారనే అంశంపై జోరుగా బెట్టింగ్‌లు సాగాయి. చాలా మంది ఆర్కే గెలుస్తాడని ఆయన వైపే బెట్టింగ్‌లు వేసినట్లు తెలిసింది. అయితే లగడపాటి సర్వే వెల్లడి అనంతరం కొందరు డబ్బుల ఆశతో నారా లోకేష్‌పై బెట్టింగ్ కాసినట్లు సమాచారం. ఈ క్రమంలో వారు ఇప్పుడు లోకేష్ ఓటమి పాలవడంతో లబోదిబోమంటున్నారట. కొందరైతే ఆస్తులమ్మి మరీ భారీ స్థాయిలో బెట్టింగ్‌లు వేసినట్లు కూడా తెలిసింది. ఈ క్రమంలో నారా లోకేష్ ఓటమి.. ఆ విధంగా బెట్టింగ్ రాయుళ్లను కూడా కొంపముంచిందన్నమాట..!