మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. సోమవారం చంద్రబాబు నేతృత్వంలో స్ట్రాటజీ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపదీ ముర్ముకు మద్దతువ్వాలని టీడీపీ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా.. వైసీపీ ప్లీనరీ, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. అంనతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. అమ్మను గెంటేసినవాడు ప్రజలకేం చేస్తాడంటూ విమర్శలు గుప్పించారు. జగనుది విశ్వసనీయత కాదు.. విషపునీయత అంటూ మండిపడ్డారు. మద్య నిషేధం, సీపీఎస్, అమరావతిపై మాట తప్పి మడమ తిప్పడం విశ్వసనీయతా? అంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ ప్లీనరీలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, చిన్నాన్నపై గొడ్డలివేటు వేసిన నేరస్థుల్ని కాపాడటం విశ్వసనీయతా? అని ప్రశ్నించారు.
పులివెందులలోనే జగన్ను ఓడించడానికి పులివెందుల ప్రజలు ఎదురు చూస్తున్నారని, అమ్మని గెంటేసిన వాడు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏం చేస్తాడు..? స్కూల్ పిల్లలకు ఏం చేస్తాడు..? అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ ఓటమి భయంతోనే టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు నిలిపివేస్తారనే అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, జగన్ కన్నా చంద్రబాబు సంక్షేమానికి ఎక్కువ ఖర్చు చేశారన్నారు. పాఠశాలల విలీనం ఉపసంహరించుకోవాలని, 51 వేల ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలన్నారు చంద్రబాబు. మోటార్లకు మీటర్లు కేంద్రం ఉపసంహరించుకుందని, దీనిపై జగన్ వైఖరి చెప్పాలన్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మెకు టీడీపీ సంఘీభావ తెలిపిందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కు భద్రత పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.